
Global Investors Summit: గతంలో ఎన్నడూలేనంతగా జగన్ సర్కారు తీవ్ర ఒత్తిడని ఎదుర్కొంటోంది. రాజధానుల అంశాన్ని తేల్చాలని భావిస్తోంది. కానీ సాధ్యం కావడం లేదు. రాజధాని తేలితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కుదురుతుంది. అయితే రాజధానుల ఇష్యూ సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 23న విచారణ జరగనుంది. జనవరి 31న స్పష్టమైన తీర్పు వస్తుందని భావించినా.. కోర్టు అనూహ్యంగా వాయిదా వేసింది. 23 కంటే ముందుగానే విచారించాలని ప్రభుత్వం కోరుతున్నా అది సాధ్యమయ్యే పనికాదు. అలాగని 23న తీర్పు వస్తుందని భావించలేం. మరిన్ని వాయిదాలు కొనసాగే అవకాశముంది. దీంతో పారిశ్రామికవేత్తలకు ఏంచెప్పాలో తెలియక వైసీపీ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది.
విశాఖలో మార్చి 2,3 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేస్తోంది.దీనిని నిర్వహణకు రూ.50 కోట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించి సన్నాహాక సదస్సులను ఢిల్లీ, బెంగళూరులో నిర్వహించింది. అయితే ఈ సమావేశానికి హాజరైన జగన్ తాము విశాఖ నుంచి పాలన సాగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. కానీ దీనిని పారిశ్రామికవేత్తలు నమ్మడం లేదు. అయితే రాజధానుల వ్యవహారంలో అపఖ్యాతిని ఎదుర్కొంటున్న వైసీపీ సర్కారు తీరుపై పారిశ్రామికవేత్తలు అనుమానపు చూపులు చూస్తున్నారు. దీంతో వారిని ఒప్పించేందుకేనైనా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని కేసును ఒక కొలిక్కి తేవాలన్న ప్రయత్నంలో జగన్ సర్కారు తెగ ఆరాటపడుతోంది.
అయితే ప్రభుత్వ వ్యతిరేక వర్గాలుగా ఉన్నవారు కేసును వీలైనంత వరకూ సుప్రీం కోర్టులో జాప్యం చేయాలని చూస్తున్నారు. హైకోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ఇదే ఫార్ములాను అనుసరించింది. కానీ సుదీర్ఘ విచారణల అనంతరం అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా కేసు జాప్యం చేస్తే రాజధాని ఇష్యూలో వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని భావిస్తున్నారు. ఇంతలో ఎన్నికలు వస్తాయి.. రాష్ట్రంలో అధికారం చేతులు మారితే తిరిగి అమరావతి రాజధానిగా నిలబడుతుందన్నది ప్రభుత్వ వ్యతిరేకవర్గాల భావన.

అయితే తాము ప్రతిపాదించిన మూడు రాజధానులు ఏర్పాటుకాక.. పారిశ్రామిక పెట్టుబడులు రాకపోతే రాజకీయంగా తమకు ఇబ్బందులు తప్పవన్న భావనకు వచ్చిన ప్రభుత్వ వర్గాలు నానా యాతన పడుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో పారిశ్రామిక పెట్టుబడులతో మూడు రాజధానులకు ముందడుగు వేయాలనుకుంటున్న జగన్ సర్కారుకు పారిశ్రామికవేత్తలు పెద్దగా నమ్మడం లేదు. అందుకే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వారు కొత్త పల్లవిని అందుకుంటున్నారు.మూడు రాజధానుల ముచ్చట అన్నేదే లేదని.. ఉన్నది ఏకైక రాజధాని విశాఖ మాత్రమేనని పారిశ్రామికవేత్తలను నమ్మించే పనిలో పడ్డారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ తేలదు. పారిశ్రామికవేత్తలు విశాఖలో పెట్టుబడి పెట్టే చాన్సే లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.