YCP: వైసీపీ పాలనలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతల దౌర్జన్యాలపై బాధితులు ఒక్కరొక్కరుగా గళం విప్పుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని గూడూరు మండలం గుడిపాడు లో దారుణం చోటుచేసుకుంది.
ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో కట్టెలు వేసుకున్న మీనాక్షమ్మను దారుణంగా హింసించారు. సచివాలయం రైతు భరోసా పాలకేంద్రం నిర్మించేందుకు మీనాక్షమ్మ ఇంటి ముందున్న స్ధలంలో జేసీబీతో కట్టెలు తొలగించే ప్రయత్నం చేశారు రెవిన్యూ సిబ్బంది, పోలీసులు .
ఇంటి ముందు ఉన్న స్ధలం తమదేనని మీనాక్షమ్మ ప్రాధేయ పడినా రెవెన్యూ సిబ్బంది కనికరించలేదు. కిరోసిన్ పోసుకొని మీనాక్షమ్మ ఆత్మహత్యాయత్నం చేసినా అధికారులు ఆగలేదు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. మీనాక్షమ్మ కూమార్తెలను చున్నీతో కట్టి బంధించిన మహిళా పోలీసులు దారుణానికి ఒడిగట్టారు. తమను విడిచి పెట్టాలని కాళ్లు మొక్కినా మహిళా
పోలీసులు కనికరించలేదు.
స్ధానిక వైసీపీ నాయకుల మాటలు విని స్థలాన్ని ఖాళీ చేస్తున్నారని మీనాక్షమ్మ కుటుంబం ఆవేదన చెందుతోంది. సర్వే నంబర్ 75లోని 24 సెంట్లు ప్రభుత్వ స్ధలమని స్ధలానికి సంబంధించిన పత్రాలు ఏవీ మీనాక్షమ్మ దగ్గర లేవని అధికారులు అంటున్నారు. మీనాక్షమ్మ అర్హతను బట్టి వేరే చోట స్ధలం ఇస్తామంటున్న రెవెన్యూ సిబ్బంది. పేదింటి మహిళపై దౌర్జన్యం ఇప్పుడు రాష్ట్రమంతా దుమారం రేపుతోంది. బాధితుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.