కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో పోలీసులు పలువురిని కొట్టిన, జర్నలిస్టులపై దాడి చేసిన ఘటనలు చూశాం. మరోవైపు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందున్నాం అంటున్నారు పోలీసులు. విజయవాడలో పోలీసులు ఆదివారం తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కబేళా సమీపంలో నివాసం ఉండే షేక్ సిద్ధికా(25) నిండు గర్భిణీ. ఈ రోజు ఉదయం ఆమెకు ఉన్నట్టుండి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న ఆటో స్టాండ్ లో ఆటో కోసం ప్రయత్నించగా ఎవరు కిరాయికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురయ్యింది.
ఏమిచేయాలో తెలియని పరిస్థితులలో వారు భవానీపురం పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన భవానీపురం పోలీస్ స్టేషన్ సి ఐ మోహన్ రెడ్డి గారు సిబ్బందితో కలసి వెంటనే సిద్ధికా ఇంటికి చేరుకొని ఆ మహిళను ఠాణా వాహనంలో అమెరికన్ హాస్పిటల్ కు తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు రోడ్లపై తిరుగుతున్నా వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఆపద సమయంలో ఆపన్నులను అడుకోవడంలోను ముందుంటున్నారు.