ఇప్పటికే వివాదాలకు కేరాఫ్ అయిన విజయవాడ దుర్గగుడిలో మరోసారి కలకలం రేపింది. అమ్మవారి హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఇక్కడ పదేపదే ఈ ఘటనలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనేది టాక్. బుధవారం అమ్మవారి హుండీ లెక్కింపు సందర్భంగా ఇద్దరు సిబ్బంది రూ.60 వేలు దొంగతనం చేశారు. ఎస్పీఎఫ్ తనిఖీల్లో ఇద్దరి వద్ద డబ్బులు దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ఉరితాళ్లు పట్టుకెళ్లి బాబును ఒప్పిస్తం.. టీడీపీ నేతలు
అయితే.. ఈ చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆలయ అధికారులు సిద్ధం కాగా.. ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో వారు ఆ ప్రయత్నాలు విరమించుకున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులను ప్రశ్నించగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. మల్లికార్జున మహామండపంలో ఉన్న అమ్మవారి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించే కార్యక్రమంలో 70 మంది దేవస్థానం ఉంద్యోగులు, 200 మంది సేవా సిబ్బంది పాల్గొన్నారు.
లెక్కింపు ప్రారంభించే ముందు ఎస్పీఎఫ్ సిబ్బంది పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తారు. లెక్కింపులో పాల్గొనే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారి దగ్గర ఉన్న బంగారం, నగదు వివరాలను రిజిస్టర్ లో నమోదు చేసి లోపలికి పంపిస్తారు. కానీ.. ఈ ప్రక్రియ అంతా తూతూ మంత్రంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దేవస్థానం అధికారులు 5 వేల మందికి సేవా సిబ్బంది పాస్ లు జారీ చేయడంతో హుండీ లెక్కింపు సమయంలో ఆలయ ఉద్యోగులకంటే ఎక్కువగా సేవా సిబ్బందే కనిపిస్తున్నారు.
Also Read: తిరుపతి బరిలో జనసేన..బీజేపీకి షాక్?
భక్తులు సమర్పించిన కానుకలు నెలకు రూ.3 కోట్లతోపాటు వెండి,బంగారం, ఇతర వస్తువులు ఉంటాయట. లెక్కింపు సమయంలో సరిగా తనిఖీలు చేయకపోవడం, నిబంధనలు పాటించకపోవడంతో ప్రతీసారి కానుకలు మిస్ అవుతున్నాయి. ఎస్పీఎఫ్, సెక్యూరిటీ సిబ్బందికి దేవస్థానం ప్రతీ ఏడాది కోట్ల రూపాయల వేతనాలు చెల్లిస్తోంది. లెక్కింపు సమయంలో సరిగా తనిఖీలు చేపట్టకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో హుండీలోని నగదు పక్కదారి పడుతోంది. హుండీ లెక్కింపు సమయంలో ఆలయ సిబ్బందితో పాటు దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు తప్పని సరిగా రావాల్సి ఉన్నా.. దేవాదాయ శాఖ నుంచి నామమాత్రంగా ఒకరు మాత్రమే హాజరవుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్