Vijayashanthi BJP: తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ రాకముందు పోరాడింది నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి. రాములమ్మగా సినిమాల్లో ఫేమస్ అయిన ఈమె రాజకీయాల్లో ఎందుకో రాణించలేకపోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సొంత పార్టీతో వచ్చిన ఈమె అప్పటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తో కలిసిపోయారు. కేసీఆర్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. కేసీఆర్ ముద్దుల చెల్లిగా మారి.. టీఆర్ఎస్ లో నంబర్2 స్థానాన్ని దక్కించుకున్నారు. ఈమెను కేసీఆర్ ఎంపీని చేసి ఢిల్లీకి కూడా పంపించారు.
అయితే కేసీఆర్ తో విభేదాలు.. పొసగక పోవడంతో రాములమ్మ బయటకు వచ్చారు. అనంతరం కేసీఆర్ ను తిడుతూ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెసోళ్లు కూడా బాగానే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రచార కమిటీ చైర్మన్ చేశారు. రాములమ్మ కోరిక మేరకు గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ సీటు కూడా ఇచ్చారు. అయినా ఎన్నికల్లో గెలవలేకపోయింది.
ప్రచార కమిటీ చైర్మన్ ను చేసినా తనను పట్టించుకోవడం లేదని నాడు కాంగ్రెస్ పై అలకబూనారు. ప్రొటోకాల్ లొల్లి మొదలుపెట్టారు. రాములమ్మ కాంగ్రెస్ ఇమడలేరని అర్థం కావడంతో ఆ నాయకులు పట్టించుకోలేదు. చివరకు బీజేపీ నేతలు గాలం వేసి విజయశాంతిని బీజేపీలో చేర్చుకున్నారు.
జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా మొదట్లో బాగానే విజయశాంతిని నెత్తిన పెట్టుకుంది. కానీ తర్వాత నేతలంతా బిజీ అయిపోయారు. బండి సంజయ్ ఎవరితో సంబంధం లేకుండా తన మానాన తను పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. పార్టీ సీనియర్లను, పెద్దలను కనీసం కలుపుకోవడం లేదన్న టాక్ ఉంది. బీజేపీ చీఫ్ నే అలా ఒంటరిగా వెళితే ఇక పార్టీని పట్టించుకునే వారేరి.అందుకే ఎవరి దారిన వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని గమ్మున ఉంటున్నారు.
ఇక్కడే విజయశాంతికి మండింది. బీజేపీలో ఉంటూ తనను పట్టించుకోకపోవడం ఏంటని భగ్గుమంది. ఇప్పుడు బీజేపీలోనూ అసమ్మతి రాజేస్తుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీ తనను నిశ్శబ్దంలో ఉంచిందని ఆరోపించింది. సర్వాయి పాపన్న జయంతిలో కనీసం మాట్లాడే అవకాశం కూడా తనకు ఇవ్వలేదని మళ్లీ ప్రొటోకాల్ లొల్లి మొదలుపెట్టింది.
నా సేవలను బీజేపీ ఉపయోగించుకోదలుచుకోలేదని.. కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వరా? అంటూ ఓపెన్ గానే బీజేపీ పెద్దల తీరుపై విజయశాంతి మీడియా ముందు ఫైర్ అయ్యింది. పార్టీ బాధ్యతలు ఇవ్వకుండా ఏం చేయగలమని.. నా పాత్ర ఎప్పుడూ టాప్ యేనని.. ఉద్యమకారిణిని పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బెటర్ .. నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్ కే తెలియాలి అంటూ బీజేపీ తీరుపై భగ్గుమంది.
ఇలా కేసీఆర్ లో నంబర్ 2 పొజిషన్ ఇచ్చినా రాములమ్మ చల్లబడలేదు. కాంగ్రెస్ నెత్తిన పెట్టుకున్నా చాలలేదు. ఇప్పుడు బీజేపీ పట్టించుకకపోయేసరికి ఇక్కడా రాములమ్మ కోపం చల్లారలేదు. ఇక మారడానికి ఏ పార్టీ లేదు. మరి రాములమ్మ పార్టీ మారుతుందా? బీజేపీలో ఇముడుతుందా? అన్నది చూడాలి.