Vijaysai Reddy Family: వైసిపి కీలక నేత విజయసాయి రెడ్డికి కుటుంబం ఝలక్ ఇచ్చింది. ఆయన సమీప బంధువులంతా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు. దీంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారింది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయన కుటుంబ సభ్యులు పార్టీకి దూరమవుతుండడం విశేషం.
విజయసాయిరెడ్డి బావమరిది, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 1994లో ద్వారకానాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1999లో టిడిపి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కలేదు. గత కోనేళ్లుగా వైసీపీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.చంద్రబాబు సమక్షంలో నేడు టిడిపిలో చేరనున్నారు.
ద్వారకానాథ్ రెడ్డిది సుదీర్ఘ రాజకీయ నేపథ్య కుటుంబం. 1962 నుంచి ఈయన కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున ద్వారకానాథ్ రెడ్డి తండ్రి రామ సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విజయ్ సాయి రెడ్డి భార్య ద్వారకానాథ్ రెడ్డికి స్వయాన అక్క. మరో సోదరి హరమ్మ నందమూరి తారకరత్న అత్త. తారకరత్న మరణంతో చంద్రబాబుతో ఆ కుటుంబానికి మళ్లీ సాన్నిహిత్యం పెరిగింది. అదే తెలుగుదేశం పార్టీలో చేరికకు దోహద పడింది. ద్వారకానాథ్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు సురేంద్రనాథ్ రెడ్డి, తారకరత్న అత్త హరమ్మ సైతం టిడిపిలో చేరనున్నారు. రాయచోటి ఎమ్మెల్యే టికెట్ భరోసాతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ఆశావహులుగా ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. తాజాగా ద్వారకానాథ్ రెడ్డి చేరడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.