Vijaysai Reddy: జర్నలిస్ట్ గా మారిన విజయసాయిరెడ్డి

వాస్తవానికి విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. కానీ జగన్ కేసుల్లో ఎ2 నిందితుడిగా మారి జైలు జీవితం కూడా అనుభవించారు. అప్పటినుంచి ఆయన ఫేమ్ మారింది.

Written By: Dharma, Updated On : November 14, 2023 1:10 pm

Vijaysai Reddy

Follow us on

Vijaysai Reddy: తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శల డోసు పెంచారు. అటు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తో పాటు తెలుగుదేశం పార్టీ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. విజయసాయిరెడ్డిమీడియాతో మాట్లాడడం అరుదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉండడంతో.. చిన్న అంశాన్ని సైతం సునిశితంగా పరిశీలించి విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీపై చేసిన విమర్శ ఒకటి ఆలోచింపజేస్తోంది. అయితే అక్కడే ఒక అనుమానం కలుగుతోంది. పూర్వాశ్రమంలో విజయసాయిరెడ్డి జర్నలిస్టుగా పని చేశారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

వాస్తవానికి విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. కానీ జగన్ కేసుల్లో ఎ2 నిందితుడిగా మారి జైలు జీవితం కూడా అనుభవించారు. అప్పటినుంచి ఆయన ఫేమ్ మారింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. జగన్ కంటే మించి కష్టపడ్డారు. జగన్ కోసం ఢిల్లీ పెద్దల ఎదుట ఎంత తలంచాలో.. అంతలా తల వంచిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి హవా కొనసాగింది. మధ్యలో కొద్ది రోజులు పాటు సైలెంట్ అయినా.. ఇటీవల యాక్టివ్ గా మారారు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ప్రత్యర్థులకు ఆందోళన గురి చేస్తున్నాయి.

ఇటీవల తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకొని విజయ్ సాయి రెడ్డి పెట్టిన పోస్ట్ ఒకటి ఆకట్టుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఐదు శాతం నుంచి ఓట్లు రావని.. కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాలకి ఆ పార్టీ పరిమితం కానుందని విజయసాయిరెడ్డి తేల్చేశారు. ఈ క్రమంలో ఆయన పెట్టిన పోస్ట్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఎక్కడ పద దోషం.. అన్వయ దోషం లేకుండా రాసుకొచ్చారు. జర్నలిస్టు రాసిన పదజాలంతోనే ఈ పోస్ట్ ఉండడం విశేషం. గణాంకాలు, కేస్ స్టడీస్ తో ఒక కథనం మాదిరిగా సోషల్ మీడియాలో పోస్ట్ కనిపిస్తోంది. దీంతో విజయసాయి జర్నలిస్టు అన్న అనుమానం కలగక మానదు. అయితే ఆయన చార్టెడ్ అకౌంట్ చేశారే కానీ.. జర్నలిజం చేసిన దాఖలాలు లేవు. దీంతో ఆయన తన పోస్టులను ఎవరో జర్నలిస్టులతో రాయించి ఉంటారన్న అనుమానం కలుగుతోంది.

మొన్న ఆ మధ్యన విజయసాయిరెడ్డి కేంద్ర పెద్దలను పొగడ్తలతో ముంచేత్తేవారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఎటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా.. వారికి భజన చేస్తూ విజయసాయిరెడ్డి పెట్టే పోస్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కుటుంబ సభ్యులు బుక్ అయిన నాటి నుంచి ఈ పొగడ్తల డోసు పెరిగింది. అరెస్టులు, బెయిల్లు పూర్తయిన తర్వాత ఈ పోస్టుల సంఖ్య తగ్గింది. అయితే కేంద్ర పెద్దలను సోషల్ మీడియాలో పొగిడేందుకు ఏకంగా ఒక ప్రైవేటు ఏజెన్సీ తో విజయసాయిరెడ్డి ఒప్పందం చేసుకున్నారని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు పేరు మోసిన జర్నలిస్టు మాదిరిగా పోస్టులు పెడుతుండడంతో.. ఎవరితో రాయిస్తున్నారు అన్న అనుమానం వెంటాడుతోంది. మొత్తానికైతే విజయ్ సాయి రెడ్డి జర్నలిస్టుగా మారారా? ఎవరైనా జర్నలిస్టు సేవలను వినియోగించుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది.