Vijayasai Reddy: తనకు దక్కని అందం.. ఇంకెవ్వరికీ దక్కకూడదు. మగధీరలో కీలక సన్నివేశంలో వచ్చే డైలాగు ఇది. వైసీపీ రాజకీయాలకు అచ్చం బల్ల గుద్దినట్టు సరిపోతోంది. వైసీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు మూల స్తంభాలు. పార్టీ అధినేత జగన్ కు వీరవిధేయులు. కానీ తమ మధ్య ఆధిపత్యం విషయంలో మాత్రం వెనక్కి తగ్గరు. పార్టీలో నంబరు టూ నేనంటే నేను అంటూ కాలు దువ్వుతున్నారు. ముగ్గురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు ఉన్నాయి.
కానీ అధినేత జగన్ విషయంలో విధేయత ప్రదర్శిస్తున్నా.. వీరికంటూ ఒక కొటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీని నాశనం చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మొన్నటివరకూ ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసిన ఎంపీ విజయసాయిరెడ్డి మూడేళ్లుగా సాగర నగరంలో తిష్ట వేశారు. అధినేత జగన్ ఇచ్చిన టాస్కును పూర్తి చేయడంలో మాత్రం విఫలమయ్యారు. సాధారణ ఎన్నికల నుంచి మొన్నటి నగరపాలక సంస్థ ఎన్నికల వరకూ టీడీపీ అక్కడ పట్టు నిలుపుకోవడమే దీనికి ఉదాహరణ. సాధారణ ఎన్నికల్లో విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులు వెలగపూడి రామక్రిష్ణబాబు, పెతకంశెట్టి గణబాబు, గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్ లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే ఇందులో వాసుపల్లి గణేష్ కుమార్ ను మాత్రమే వైసీపీ గూటికి తేవగలిగారు.
నగరపాలక సంస్థ ఎన్నికల్లో సైతం టీడీపీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. అయితే ఇక్కడ వైసీపీకి అనుకున్న మైలేజ్ రాచకపోవడానికి ఎంపీ విజయసాయిరెడ్డి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలను కాదని… కింది స్థాయి కార్పొరేటర్లు, నామినెటెడ్ పదవులున్న వారితో గ్రూపులు కట్టారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల పార్టీ బాధ్యతల నుంచి తనను తప్పిస్తారన్న సమాచారం ఉండడంతో ఈ విభేదాలకు విజయసాయిరెడ్డి మరింత ఆజ్యం పోశారు. తనకు ఇష్టమైన సాగరనగరం బాధ్యతల నుంచి తప్పించడంపై ఆగ్రహంతో ఉన్న ఆయన ఆ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. కిందిస్థాయి కేడర్ ను కెలికి వెళ్లిపోయారు. దీంతో విశాఖ వైసీపీలో విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
కీలక పరిణామం
ఇటీవల విశాఖ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో విశాఖ-దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ తరఫున గెలిచి.. అనంతరం వైసీపీ పంచన చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. 2024లో తిరిగి జగన్‌ను సీఎంను చేయాలని అంతా కసితో ఉన్నారని.. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతారని.. కార్పొరేటర్లు, రాజ్యసభ సభ్యుడు గెలిస్తే కారని.. ఈ విషయం విజయసాయిరెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. శుక్రవారం ఒక కార్యక్రమానికి హాజరైన వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నియోజకవర్గంలో తప్పు జరుగుతోందని మొదటి నుంచీ తాను చెబుతున్నా విజయసాయిరెడ్డి పట్టించుకోలేదని, ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి అయినా పట్టించుకుంటారని ఆశిస్తున్నానని వాసుపల్లి అన్నారు. తన నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించడం లేదని.. పార్టీ కోసం పనిచేసే గుర్రాలను కాదని, తన్నే గుర్రాలకు పదవులు కట్టబెడుతున్నారని విజయసాయిపై అసహనం వ్యక్తంచేశారు. ఆయన మొదటి నుంచీ తన నియోజకవర్గంలో తప్పులు చేస్తున్నారని విమర్శించారు. కొంతమంది ఆయన కోటరీలో చేరి పార్టీకి నష్టం కలిగిస్తున్నారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్.. వార్డు వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులంతా తాను చెప్పినట్లే చేయాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో నేనే ఎమ్మెల్యేనవుతాను.. నాకు విజయసాయిరెడ్డి దన్ను ఉందని సుధాకర్ చెప్పడంతో వారిలో భయం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని వాసుపల్లి ధీమా వ్యక్తంచేశారు.
Also Read:Minister KTR: మంత్రి కేటీఆర్ మళ్లీ రైతుల వెంట పడ్డారే? వరాల వానకు కారణమేంటి?