Rahul Gandhi-Telangana: కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు, కప్పెల తక్కెడ అన్న పేరుంది. సొంత పార్టీనే ఎదురించే ధమ్ము ధైర్యం కేవలం కాంగ్రెసోళ్లకు మాత్రమే సాధ్యం. పదవుల కోసం కొట్టుకునేవరకూ వెళుతుంటారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం ఎంత యాగీ జరిగిందో అందరికీ తెలిసిందే. కోమటిరెడ్డి నుంచి మర్రి శశిధర్ రెడ్డి, పండు ముదుసలి వీహెచ్ వరకూ అందరూ రేవంత్ రెడ్డిని అందరూ వ్యతిరేకించారు. అసమ్మతి రాజేశారు. ఈ అసమ్మతే కాంగ్రెస్ పుట్టి ముంచుతుంది. ప్రత్యర్థులను అధికారంలోకి తెస్తుంది. అందుకే దీన్ని అరికట్టడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెడీ అయ్యారు. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ విసృతస్థాయి సమావేశంలో ఈ మేరకు రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

-ఉత్సాహం నింపి షాకిచ్చిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం నింపింది. ఆయన పర్యటనను రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు ఉత్సాహం ఉన్న వేళ రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు నాయకుల నోట్లో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారింది. ఇప్పుడా నేతల సీట్లకే ఎసరు తెచ్చింది. వారి భవిష్యత్తుపై నీలినీడలు కమ్మేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు కావాలంటే ప్రజల్లో ఉండాల్సిందేనని.. ప్రజల్లో ఉండే నేతలకే టికెట్లు ఇస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటన కాంగ్రెస్ నేతలు షాకిచ్చినట్టైంది. హైదరాబాద్ బిర్యానీ, చాయ్ బాగుంటాయని.. కానీ నగరం వదిలి నాయకులు గ్రామాలకు తరలితేనే సీట్లు దక్కుతాయని స్పష్టమైన హెచ్చరిక చేశారు. దీన్ని బట్టి కాంగ్రెస్ అగ్రనాయకులంతా తమ నియోజకవర్గాలు వదిలి హైదరాబాద్ లో తిష్టవేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని.. అదే ఓటమికి కారణమని రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతల గురించి స్పష్టమైన అంచనా వేశారు.
Also Read: Vijayasai Reddy: విశాఖ వైసీపీలో విభేదాలకు విజయసాయిరెడ్డి ఆజ్యం.. అసలు ఏం జరిగిందంటే
-రోడ్డెక్కితేనే నేతలకు సీట్లు
ప్రజా సమస్యలపై రోడ్డెక్కితేనే ఇక కాంగ్రెస్ నాయకులకు సీట్లు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ పెద్ద బాంబే పేల్చారు. ఎందుకంటే ఇన్నిరోజులు హైదరాబాద్, ఢిల్లీలో ఉంటూ నాలుగు ప్రెస్ మీట్లు, ఆరు హైదరాబాద్ లో ఆందోళనల్లో పాల్గొంటూ మమ అనిపించేసిన కాంగ్రెస్ నేతలకు షాకిస్తూ రాహుల్ గాంధీ స్పష్టమైన సందేశాలను పంపారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, యువత కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పోలీసులు, డబ్బు, అధికార యంత్రాంగంతో ఉన్న టీఆర్ఎస్ ను ప్రజాబలంతోనే ఎదుర్కోవాలని రాహుల్ గాంధీ కీలక సూచనలు చేశారు. ప్రజల్లో ఉంటేనే వీటన్నింటికి పరిష్కారం అని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నేతలు జనాల్లోకి వెళ్లాలని రాహుల్ గాంధీ హితబోధ చేశారు.
-టీఆర్ఎస్ తో పొత్తుల్లేవ్
తెలంగాణకు ద్రోహం చేసిన శక్తులతో ఎలాంటి పొత్తులు ఉండబోవని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనతో ఇక టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని తేలిపోయింది. కేసీఆర్ ఓ కన్ను బీజేపీపై.. రెండో కన్ను కాంగ్రెస్ పై వేస్తూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దీనికి చెక్ పెడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పష్టమైన క్లారిటీని ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే తెలంగాణలో ఫైటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తుల ఎత్తుల్లో చిత్తు చేస్తున్న కేసీఆర్ తో ఇక పొత్తు ఉండదని చెప్పి రాహుల్ గాంధీ భరోసానిచ్చాడు. తెలంగాణకు ద్రోహం చేసిన టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తులు ఉండబోవని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి కేసీఆర్ ను సాగనంపేలా రాహుల్ గాంధీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
-యువతనే టార్గెట్
తెలంగాణలో రాహుల్ గాంధీ యువతనే టార్గెట్ చేశారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ పెడచెవిన పెట్టిన నిరుద్యోగుల ఎజెండానే ఎత్తుకున్నారు. యువతకు అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో యువతను పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ తరుఫున యువతకు టికెట్లు ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. తద్వారా సీనియర్లకు చెక్ పెట్టి యువతను ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే ఎత్తుగడ వేశారు.

-విద్య, వైద్యం, ఉపాధి.. డిక్లరేషన్ తో ప్రజల్లోకి..
ప్రధానంగా కాంగ్రెస్ విద్య, వైద్యం, ఉపాధి, వరంగల్ లో చేసిన డిక్లరేషన్ తోనే రాబోయే ఎన్నికల్లో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యింది. ప్రజలు, కార్మికులు, ఆఖరుకు చిన్న పిల్లలకు కూడా కాంగ్రెస్ అజెండా తెలిసేలా చేయాలని ప్రచారానికి రాహుల్ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలకు కావాల్సినవి ప్రధానంగా విద్య, వైద్య, ఉపాధి కావడంతో వాటినే పట్టి టీఆర్ఎస్ కుంభస్థలంపై కొట్టి ఓడించడానికి కాంగ్రెస్ రెడీ అయ్యింది.
-అసమ్మతి నేతలపై ఉక్కుపాదం
ముఖ్యంగా మీడియాకు ఎక్కి అసమ్మతి రాజేస్తున్న కాంగ్రెస్ అసమ్మతి నేతలపై ఉక్కుపాదం మోపడానికి రాహుల్ నిర్ణయించారు. వీరివల్ల పార్టీకి ఏం ఉపయోగం లేదని.. వారికి టికెట్లు కూడా ఇవ్వనని రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి పార్టీలో అంతర్గతంగా సమస్యలుంటే వాటిని మీడియాకు ఎక్కి రచ్చ చేయవద్దని.. నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాలని రాహుల్ గాంధీ దిశానిర్ధేశం చేశారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలను అంగీకరించనని హెచ్చరికలు పంపారు.
-ఇక పాత నేతల కొత్త కలయిక
ఇక పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని రాహుల్ డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయి ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ గా లేని నేతలందరినీ తిరిగి సొంత గూటికి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఇతర పార్టీల నుంచి ఎలాంటి ఆరోపణలు లేని వారు వస్తామంటే అభ్యంతరం చెప్పొద్దని సూచించారు. పోటీ వస్తారని చేరికలను సీనియర్లు అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ కీలక వ్యూహాలు రచించారు. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కుమ్ములాటలు తగ్గించి ఏకతాటిపైకి వచ్చి ప్రజల్లోకి వెళితేనే విజయం తథ్యమని పక్కా ప్రణాళికతో వెళ్లేందుకు రెడీ అయ్యారు. మరి ఈ వ్యహాలు పనిచేస్తాయా? కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాయా? అన్నది వేచిచూడాలి.
Also Read:Rahul Gandhi: రాహుల్ గాంధీ స్ట్రాటజీ: జనంలో ఉండే వారికే టికెట్.. అసమ్మతులు ఔట్
Recommended Videos:



[…] […]