Vijaysai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు. రాయలసీమ బాధ్యతలను ఆయనకు కట్టబెట్టారు.గత కొన్ని నెలలుగా వైసీపీలో అంటి ముట్టినట్టుగా వ్యవహరించిన ఆయన అవసరాన్ని జగన్ గుర్తించినట్టు ఉంది. అందుకే కీలక బాధ్యతలు అప్పగించారు. బాలినేని వద్దనుకున్న బాధ్యతలను కట్టబెట్టారు.వైసీపీలో ఇదే చర్చనియాంశంగా మారింది.
వైసీపీలో విజయసారెడ్డిది యాక్టివ్ రోల్. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తూ జైలు జీవితం కూడా అనుభవించారు. అందుకు తగ్గట్టుగానే పార్టీలో విజయసాయి రెడ్డికి గౌరవ స్థానం దక్కింది.నెంబర్ 2 స్థాయికి ఎదిగారు. కానీ గత కొంతకాలంగా ఆయన పార్టీకి అంటి ముట్టినట్టుగా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెంచి విజయ్ సాయి రెడ్డికి తగ్గించేశారన్న వార్తలు వచ్చాయి . విజయ్ సాయి రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కూడా రావడం మానేశారు. వీలైనంతవరకు ఢిల్లీలోనే గడుపుతూ వచ్చారు. మొన్న మధ్యన పార్టీ వర్క్ షాప్ లో విజయ్ సాయి పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారం జరిగింది. విజయ్ సాయి వయసు అయిపోయిన దృష్ట్యా ఆయన స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకోనున్నట్లు జగన్ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో విజయసాయిరెడ్డి కి వైసీపీలో చాప్టర్ క్లోజ్ అన్న ప్రచారం ఊపందుకుంది.
అయితే అనూహ్యంగా విజయ్ సాయి రెడ్డికి వైసీపీలో కీలక పదవిని కట్టబెట్టారు. చిత్తూరు,నెల్లూరు, కడప రీజనల్ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఈ పదవిని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్వర్తించేవారు. కానీ ఆయన అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. హై కమాండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలినేని వెనక్కి తగ్గలేదు. మిగతా నాయకులు సైతం బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో జగన్ విజయసాయిరెడ్డిని పిలిపించారు. ఆ మూడు జిల్లాల సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో విజయసాయి బాలినేనిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దీంతో తానే ఆ బాధ్యతలు తీసుకోవడం అనివార్యంగా మారింది.
ప్రస్తుతం విజయసాయిరెడ్డి వద్ద ఒక్క రాజ్యసభ పదవి ఉంది. తొలుత ఉత్తరాంధ్ర రీజనల్ సమన్వయకర్తగా ఉన్న విజయ్ సాయి వద్ద పార్టీ సోషల్ మీడియాతో పాటు అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలు ఉండేవి. కానీ ఒక్కొక్క పదవిని దూరం చేస్తూ వచ్చారు. ఆయన సైతం వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా ఉండేవారు కాదు. ఈ తరుణంలో విజయ్ సాయి రెడ్డిని పిలిచి రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడం విశేషం.