
Vijay Rupani Resigns: గుజరాత్ లో ఊహించని రాజకీయ పరిణామాలు చేసుకుంటున్నాయి. సీఎంలను మార్చడం కాంగ్రెస్ నుంచి మొదలైనా ఇప్పుడు ఆ సందప్రదాయం బీజేపీకి కూడా అంటుకుంది. దీంతో ముఖ్యమంత్రులను మార్చుతూ అదే సంస్కృతికి పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. గత జులైలోనే కర్ణాటక సీఎం యడ్యూరప్ప ను మార్చారు. ప్రస్తుతం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వంతయింది. ఆయన శనివారం సాయంత్రం తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు.
2016 నుంచి సీఎంగా విధులు నిర్వహిస్తున్న విజయ్ రూపానీని రాజీనామా చేయాల్సిందిగా అధిష్టానం సూచించడంతో ఆయన తన రాజీనామాను సమర్పించారు. గాంధీనగర్ వేదికగా జరుగుతున్న పరిణామాల్లో రూపానీ రాజీనామా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రిగా ఇంతకాలం సహకరించిన పార్టీకి ఆయన రుణపడి ఉంటానని చెప్పారు. కాగా తన రాజీనామాకు కారణాలు ఏమీ లేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఇంతకాలం ఉంచినందుకు పార్టీకి తన సేవలు అందజేస్తానని చెప్పారు.
మోడీ పాలనలో దేశం ముందుకు పోతోందని విజయ్ రూపానీ కొనియాడారు. గుజరాత్ అభివృద్ధిలో ముందుందని అన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే సీఎం కుర్చీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం సీఎంగా కొనసాగడంతో రాష్ర్టం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని చెప్పారు. బీజేపీలో కూడా సీఎంలను మార్చే సంప్రదాయం రావడంపై నేతలు కూడా ఆలోచనలో పడినట్లు సమాచారం.
బీజేపీ ఇటీవల కాలంలో ముఖ్యమంత్రులను తరుచుగా మారుస్తూ తన మార్కు చూపెడుతోంది. కర్ణాటకలో యడ్యూరప్పను మార్చేసింది. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో సీఎం తీరత్ సింగ్ షెకావత్ ను రాజీనామా చేయించారు. అసోం ఎన్నికల నేపథ్యంలో అక్కడ కూడా మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ కు ఉద్వాసన పలికి ఆయన స్థానంలో సీఎంగా హిమంత బశ్వ శర్మ ను నియమించారు. ఇప్పుడు తాజాగా విజయ్ రూపానీని కూడా తొలగించి చర్చలకు తెరలేపుతోంది.