YCP: ఆంధ్రా యూనివర్సిటీ వీసీ వ్యవహారం మరోసారి వివాదం అవుతోంది. వైస్ ఛాన్స్ లర్ ప్రసాద్ రెడ్డి వైసీపీ సేవలో తరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తొలి విశ్వవిద్యాలయంగా ఆంధ్రా యూనివర్సిటీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎంతోమంది మహనీయులు యూనివర్సిటీకి వీసీలుగా వ్యవహరించారు. అయితే అటువంటి యూనివర్సిటీకి గత ఐదేళ్లుగా విసిగా సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ఆది నుంచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. యూనివర్సిటీని రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారన్న ఆరోపణ ఉంది. అందుకే ఆయనకు వీసీగా రెండోసారి ఛాన్స్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా యూనివర్సిటీ విద్యార్థులతో వైసిపికి అనుకూలంగా సర్వేలు చేయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టు వర్క్ పేరుతో వైసిపి సేవల్లో తరిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రా యూనివర్సిటీకి వీసీగా ప్రసాద రెడ్డి నియమితులయ్యారు. ఆయన సీఎం జగన్ తో పాటు వైసిపి కీలక నేతల పట్ల భక్తిని చాటుకుంటారు. వారి జన్మదినాలను యూనివర్సిటీలో ఘనంగా జరుపుకోవడం వెలుగు చూసింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సమన్వయం అంతా యూనివర్సిటీ నుంచి నడిచిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తుతాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం వైసీపీ తరఫున కీలకంగా వ్యవహరించారన్న విమర్శ కూడా ఉంది.
తాజాగా వైసీపీకి అనుకూలంగా ఎన్నికల సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రాజనీతి శాస్త్రం పీజీ విద్యార్థులతో సర్వే చేపడుతున్నట్లు సమాచారం. అప్పటికి.. ఇప్పటికీ రాజకీయాల్లో మార్పు అన్న పేరుతో కొందరు విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారు. సర్వే మాటున విద్యార్థులతో ప్రచారం చేయిస్తున్నారు అన్న ఆరోపణ వినిపిస్తోంది. గతంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థుల ఎంపికకు కూడా విద్యార్థులతో సర్వే చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. తొలిసారి విసిగా నియమితులు అయినప్పుడు ఏకంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రెండోసారి వీసీగా నియమించడంతో సర్వేలతో కృతజ్ఞత తెలుపుకుంటున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ కలుగజేసుకోవాలని కోరుతున్నాయి.