V. Hanumantha Rao: కేసీఆర్, కేటీఆర్.. ఓ నాంపల్లి దర్గా; వీహెచ్ మాస్ ర్యాగింగ్ అంటే ఇలా ఉంటది

వి హనుమంతరావు.. తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కరలేని పేరు.. రాజీవ్ ల్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు వీర విధేయతను ప్రదర్శించే నాయకుడు. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఈయన.

Written By: Bhaskar, Updated On : May 19, 2023 3:25 pm

V. Hanumantha Rao

Follow us on

V. Hanumantha Rao: రాజకీయాలు అన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా సర్వసాధారణమే.. ఇవి శృతిమించనంతవరకూ బాగానే ఉంటాయి.. కానీ నాయకుల నోరు ఒక్కసారి అదుపుతప్పిందా ఇక అంతే సంగతులు. బూతులు ధారాళంగా ప్రవహిస్తూ ఉంటాయి. విమర్శలు ప్రతి విమర్శలు హద్దులు దాటుతూ ఉంటాయి.. అలాంటప్పుడు రాజకీయాలపై చాలామందికి ఎవగింపు కలుగుతూ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. తెలంగాణలో కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బంతాట ఆడుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని విమర్శించే సమయంలో కేసీఆర్ హద్దులు దాటారు అని చెప్పవచ్చు.. అన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన స్పందన వచ్చి ఉండేది కాదు.

విహెచ్ ఆ పని చేశాడు

వి హనుమంతరావు.. తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కరలేని పేరు.. రాజీవ్ ల్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు వీర విధేయతను ప్రదర్శించే నాయకుడు. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఈయన.. కొన్నిసార్లు వేసే పంచ్ లు నవ్వు తెప్పిస్తాయి. చివరికి ఈయన ప్రత్యర్థులు కూడా నవ్వుతూ ఉంటారు. హైదరాబాద్ యాసలో మాట్లాడే ఈయన చమత్కారంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఆమధ్య తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పాత్ర శూన్యం అని కెసిఆర్, కేటీఆర్ వివిధ వేదికల వద్ద స్పష్టం చేశారు. అయితే దీనిపై వి హనుమంతరావు వంటి కాలు మీద లేచారు. ” తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించింది సోనియాగాంధీ. ఒకవేళ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోయి ఉంటే కెసిఆర్, కేటీఆర్ నాంపల్లి దర్గా దగ్గర అల్లా నామ్ పే పైసా దేదో బాబా అంటూ అడుక్కుంటూ ఉండేవారని” గట్టి కౌంటర్ ఇచ్చారు. దీనికి అటు భారత రాష్ట్ర సమితి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

హావభావాలతోనూ..

వాస్తవానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో హనుమంతరావు ముందు వరసలో ఉంటారు. కెసిఆర్ ఫ్యామిలీని మాత్రమే కాదు ఆ మధ్య అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పుడు కూడా ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. అయితే విజయ్ దేవరకొండ చిల్ తాత అంటూ హనుమంతరావుకు కౌంటర్ ఇచ్చారు. ఇక భారత రాష్ట్ర సమితిని మాత్రమే కాకుండా తన సొంత పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని కూడా హనుమంతరావు చెడుగుడు ఆడుకుంటారు. ఎవరో ఇతర పార్టీల మారిన నాయకులు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాల్సి రావడం దురదృష్టకరమని ఆయన అప్పట్లోనే వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వ లేమి తోనే ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే అప్పట్లో కెసిఆర్ కుటుంబం పై చేసిన విమర్శ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా.. అది వేల కొద్దీ లైక్స్ సొంతం చేసుకుంది.