కరోనా కట్టడితో తెలంగాణ ప్రభుత్వం తొలినాళ్లలో చూపిన తెగువ ఇప్పుడు చూపడంలేదని విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. రాష్ట్రంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు భరోసా కల్పించారు. దీంతో ప్రజలు కూడా కేసీఆర్ ను నమ్మారు. అయితే కరోనా కట్టడి ప్రభుత్వం ఏమరపాటుగా ఉండటంతో మహ్మమరి రాష్ట్రంలో పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన పాజిటివ్ కేసులు నేడు పల్లెల్లోనూ భారీగా నమోదవుతుండటంతో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైనట్లు కన్పిస్తోంది.
కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం మేనమేషాలు లెక్కించదనే వాదనలు విన్పించాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న టెస్టులు ఎక్కువగా చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. హైకోర్టు పలుమార్లు ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇటీవల కాలంలో టెస్టుల సంఖ్య పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే టెస్టులు చేయాల్సిన సమయంలో చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితులు చేయిదాటిపోయినట్లు కన్పిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో కేసులు సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉండటం కొంచెం ఊరటనిస్తుంది.
అయితే కేంద్రం నుంచి తెలంగాణకు భారీగా నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం టెస్టులను ఎక్కువగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు తలెత్తుతోన్నాయి. కరోనా సాయం విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తెలంగాణకు కేంద్రం అన్నివిధలా సాయం చేస్తుందని బీజేపీ నేతలు చెబుతుండగా టీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్రం పెద్దగా సాయం చేయడం లేదని విమర్శిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా కేంద్రం తెలంగాణకు అందించిన సాయం సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రూ.215.22కోట్ల నిధులను కరోనా అవసరాలకు కేంద్రం తెలంగాణకు ఇచ్చినట్లు పేర్కొంది.
జూలై చివరి నాటికే కేంద్రం తెలంగాణకు 1400వెంటిలేటర్లు, 10.09లక్షల ఎన్-95మాస్కులు, 2.41లక్షల పీపీఈ కిట్లు, 42.50 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసినట్లు పేర్కొంది. వీటితోపాటు రూ.215.22 కోట్ల నగదు సాయాన్ని జాతీయ హెల్త్ మిషన్ పథకం కింద విడుదల చేసినట్లు పేర్కొంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, గుజరాత్, హర్యానాలు రాష్ట్రాలకు కేంద్రం తక్కువ సాయం చేసింది. అయితే ఆరాష్ట్రాలు మాత్రం కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇక ఏపీ కరోనా టెస్టుల్లో దేశంలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.
తెలంగాణ కంటే కేవలం ఐదు రాష్ట్రాలే ఎక్కువ నిధులు పొందాయి. కేంద్రం తెలంగాణకు భారీగా కరోనా నిధులు ఇచ్చినా టెస్టులు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటీవల కరోనా అవసరాల కోసం రూ.100 కోట్లు గతంలో విడుదల చేయగా ఇటీవల క్యాబినెట్ మీటింగులో మరో రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణకు కేంద్రం నుంచి భారీగా సాయం చేస్తుండగా టీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్రం పెద్దగా సాయం చేయడం లేదంటున్నారు. కరోనాకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తున్నట్లు చెబుతుండటం గమనార్హం. తాజాగా కేంద్రం రాష్ట్రానికి అందించిన నిధులు సమాచార హక్కు చట్టం కింద స్పష్టమవడంతో దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!