Vehicle Owners Alert: వాహనదారులకు ప్రభుత్వానికి సంబంధించిన సేవలను సులభంగా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన్ (VAHAN) అనే పోర్టల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో తమ వివరాలను పొందుపరచుకోవాలని వాహనదారులకు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ గడువు త్వరలో ముగియనుంది. ఆ గడువు చివరి తేదీ ఏదో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం చాలా మంది వాహన యజమానులు వాహనం కొనుగోలు చేసిన సమయంలో ఇచ్చిన పాత మొబైల్ నంబర్లు లేదా ఈమెయిల్ ఐడీలనే కొనసాగిస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఈ-చలాన్లు జారీ అయినా, వాటి సమాచారం సకాలంలో చేరడం లేదు. దీంతో జరిమానాలు పెరగడం, చెల్లింపుల్లో ఆలస్యం జరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
వాహన్ పోర్టల్‌లో తాజా మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు నమోదు చేస్తే ట్రాఫిక్ చలాన్లు, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు, పన్నులు, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ గడువు వంటి ముఖ్యమైన సమాచారం SMS, వాట్సాప్, ఈమెయిల్ రూపంలో నేరుగా అందుతుంది. దీంతో వాహనదారులు ముందుగానే అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
వివరాల అప్‌డేట్ కోసం వాహనదారులు అధికారిక VAHAN సేవల పోర్టల్‌ను సందర్శించి, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలను సరిచేసుకోవచ్చు. అవసరమైతే సమీప రవాణా శాఖ కార్యాలయం (RTO) లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ సేవను పొందవచ్చు.ఈ ప్రక్రియకు జూన్ 30 వరకు మాత్రమే గడువు ఉండగా, ఇంకా కేవలం 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
జూన్ 30 తర్వాత వివరాలు అప్‌డేట్ చేయని వాహన యజమానులకు ముఖ్యమైన నోటిఫికేషన్లు చేరడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రతి వాహనదారుడు వెంటనే తమ వివరాలను ధృవీకరించి, తాజా సమాచారంతో వాహన్ పోర్టల్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
