దళితబంధు పథకం ప్రారంభమైంది. అధికార పార్టీ చెప్పినట్లుగానే ఆచరణలో కూడా అదే స్పీడు చూపిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ఆచరణలోకి వచ్చింది. పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. వాటిలో రెండు ట్రాక్టర్లు, ఒక ట్రాలీ, ఒక కారు అందజేశారు. ఇటీవల దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో ప్రారంభించిన పథకంలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. వారు ఎంపిక చేసుకున్న వాహనాలను మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లబ్ధిదారులకు అందజేశారు.
దళితబంధు ఫలితాలు త్వరలో లబ్ధిదారులకు చేరుతున్నాయి. స్కీం ప్రారంభమైన అనతి కాలంలోనే అందుబాటులోకి రావడం ఆహ్వానించదగినదే. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన పథకం కావడంతో ప్రభుత్వం చొరవ చూపిస్తోంది. హుజురాబాద్ లోని మొత్తం 21 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. అందుకనుగుణంగా పథకం రూపకల్పన చేస్తోంది.
రాష్ర్టంలోని ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చడమే తమ లక్ష్యమని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో రూ.10 లక్షలతో వారికిష్టమొచ్చిన వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. ఇందులో ఎలాంటి షరతులు ఉండవని చెబుతున్నారు. దళితుల ఆత్మగౌరవమే ప్రధానంగా ఈ పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.2 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా అవసరమైతే నిధులు కేటాయించి అందరికి లబ్ధి చేకూరేలా చేస్తామని చెబుతున్నారు. మొత్తానికి ప్రభుత్వం అనుకున్నవిధంగా హుజురాబాద్ లో పాగా వేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.