Dadi Veerabhadra Rao: సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు పొలిటికల్ సర్కిల్లో నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఈ నాయకుడు ఇప్పుడు ఆశించిన స్థాయిలో తన ముద్రను చూపలేకపోతున్నారు. వైసీపీలో ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు.కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. అటు జగన్ సైతం వచ్చే ఎన్నికల్లో దాడి కుటుంబానికి చాన్స్ లేదని తేల్చేశారు.దీంతో దాడి వీరభద్రరావు డిఫెన్స్ లో పడిపోయారు.తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావడం చారిత్రక తప్పిదంగా ఆయన భావిస్తున్నారు. అలాగని తిరిగి మళ్ళీ టిడిపిలో చేరే పరిస్థితిలో లేరు.
విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది దాడి వీరభద్ర రావు. చంద్రబాబు దాడి వీరభద్రరావుకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా కీలక పదవులు ఇచ్చి గౌరవించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత దాడి వీరభద్రరావు అనూహ్యంగా జగన్ గూటికి చేరారు. 2009లో టిడిపి విపక్షంలో ఉన్న.. శాసనమండలిలో విపక్ష నేతగా దాడికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. కానీ అవేవీ పరిగణలోకి తీసుకోకుండా వీరభద్రరావు వైసీపీలోకి వెళ్లిపోయారు.కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి చవిచూసింది. అయితే టిడిపి మాదిరిగా వైసీపీలో దాడి వీరభద్రరావుకు ఎటువంటి గౌరవం దక్కలేదు.
వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో పదవుల కోసం దాడి వీరభద్రరావు ఎదురు చూశారు. కానీ ఎటువంటి నామినేటెడ్ పదవి సైతం దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి తన కుమారుడు రత్నాకర్ను బరిలో దింపాలని భావించారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ పై వ్యతిరేకత ఉంది. ఆయనను వచ్చే ఎన్నికల్లో ఎలమంచిలికి షిఫ్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో కుమారుడు రత్నాకర్ కు లైన్ క్లియర్ అవుతుందని భావించారు. కానీ హై కమాండ్ మాత్రం మరోసారి అమర్నాథ్ పోటీ చేస్తారని ప్రకటించింది. దీంతో దాడి కుటుంబానికి ఆప్షన్ లేకుండా పోయింది.
వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచిన తనకు అవమానమే జరిగిందని దాడి వీరభద్రరావు భావిస్తున్నారు. గత ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన చాలామందికి జగన్ పదవులు ఇచ్చారు. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావ్ కుమారుడు ఆనంద్ ను ఏకంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఖరారు చేశారు. దీంతో దాడి వీరభద్రరావు అంతర్మధనం చెందుతున్నారు. వైసీపీలో చేరి తప్పు చేశానని భావిస్తున్నారు. కుమారుడు రత్నాకర్ కు మంచి రాజకీయ జీవితం ఇవ్వలేకపోయానని మదనపడుతున్నారు. అందుకే ఆయన ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల్లో తన అభిమానులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం.