వాసాలమర్రి గ్రామంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగులకు రుణాలు, దళిత బంధు పథకంతోపాటు పలు రకాల హామీలు ఇచ్చారు. యాదాద్రి భువనగరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ బుధవారం పర్యటించారు. గ్రామంలోని దళితుల ఇళ్లన్ని తిరుగుతూ అందరిని పలకరించారు. దాదాపు 3 గంటల పాటు పర్యటించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని భరోసా కల్పించారు
సుమారు 20 మంది బీడీ కార్మికులకు పింఛన్ రావడం లేదని చెప్పడంతో తక్షణమే విడుదల చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. అందరి సమస్యలు తీరుస్తామని చెప్పారు. ఎవరు కూడా రాష్ర్టలో బాధలు పడొద్దని సూచించారు. సంక్షేమ పథకాలతో మన బతుకులు మారే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న సుమారు వంద ఎకరాల భూమిని దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దత్తత గ్రామంలో సమస్యలు లేకుండా చూస్తామని అన్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఎం గ్రామంలో సుమారు నాలుగు కిలోమీటర్లు కాలినడకన పర్యటించారు. ప్రతి ఒక్కరిని మందలిస్తూ వారి సమస్యలు ఆలకించారు. సమ్యల పరిష్కారానికి తక్షణమే పరిష్కారం చూపించారు. దత్తత గ్రామంలో ఎవరు కూడా ఏ కష్టాలు పడరాదని సూచించారు. వాసాలమర్రిని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సీఎం పర్యటనలో కేవలం దళితులను మాత్రమే అనుమతించడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
వాసాలమర్రిలో జూన్ 22న కేసీఆర్ పర్యటించారు. మరో 20 సార్లయినా ఇక్కడికి వస్తానని చెప్పారు. దళితబంధు పథకం దళితుల తలరాతలు మారుస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో వ్యాపారం చేసుకుని మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. సీఎం పర్యటనతో గ్రామంలో సందడి నెలకొంది. ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు గ్రామంలో కవాతు నిర్వహించారు. దీంతో ఎటు చూసినా నేతలు కనిపించారు . సీఎం కురిపించిన వరాల జల్లుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.