Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంద్రలోని విశాఖపట్నంలో చేపట్టిన మూడో విడత వారాహి విజయయాత్రకు రెండోరోజే అడ్డంకులు మొదలయ్యాయి. గురువారం నిర్వహించిన యాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై నోటీసులు ఇచ్చారు. వారాహి పర్యటనలో మరోసారి ఇలా రెచ్చగొట్టవద్దని సూచించారు. గురువారం చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వారాహి విజయయాత్రలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని విశాఖపట్నం తూర్పు ఏసీపీ నోటీసులు అందజేశారు.
రుషికొండ విజిట్‌కు అనుమతి..
ఇదిలా ఉండగా పవన్ శుక్రవారం రుషికొండ, ఎర్రమట్టిదిబ్బలను క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు పోలీసులు షరతులతో అనుమతి ఇచ్చారు. నగరంలోని జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతింబోమని పోలీసులు తేల్చి చెప్పారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి కేవలం పవన్ వాహనానికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్ వెళ్లాలని.. గీతం యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పోలీసులు తెలిపారు. ఈమేరకు మధ్యాహ్నం పవన్ రుషికొండకు బయల్దేరారు.
ఆగస్టు 19 వరకు యాత్ర..
మూడో విడత వారాహియాత్ర ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు విశాఖలో కొనసాగుతుంది. మూడో విడత పర్యటన పూర్తిగా నగరంలోనే కొనసాగేలా రూట్ మ్యాప్ రూపొందించారు. పది రోజులు జన సేనాని విశాఖలోనే ఉండనున్నారు. ఇక తొలి విడత యాత్ర జూన్ 14న ప్రారంభించారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, తొలి యాత్రను మొదలుపెట్టారు. మొదటి విడతలో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. ప్రతీ నియోజకవర్గంలో రెండ్రోజుల పాటు యాత్రను సాగించారు. జూలై 9న రెండో దశ వారాహి విజయ యాత్రను పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాలలో పవన్ కల్యాణ్ పర్యటించారు. విశాఖలో జరిగే మూడో విడత యాత్రను కూడా విజయవంతం చేయడానికి సన్నాహాలు చేశారు.