
Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం వ్యవహారం తెలుగుదేశం పార్టీలో కొత్త చిచ్చు రేపుతోందా? వర్గ పోరుకు తెరలేపిందా? టిక్కెట్ కేటాయింపులో టీడీపీ హైకమాండ్ కు తలపోటు తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలను నిజం చేస్తున్నాయి. రాధా పార్టీలో యాక్టివ్ అవుతుండడంతో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన బొండా ఉమామహేశ్వరరావు 25 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. గెలుపు తప్పదని నమ్మకంగా ఉన్నారు.
అయితే ఇప్పుడు వంగవీటి రాధా కూడా టీడీపీలో యాక్టివ్ అవుతుండడం, సెంట్రల్ నియోజకవర్గ టిక్కెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతుండడంతో ఉమా వర్గీయులు ఆందోళనకు గురవుతున్నారు. దివంగత మోహన్ రంగా నుంచి సెంట్రల్ నియోజకవర్గంపై ఆ కుటుంబానికి మంచి పట్టు ఏర్పడింది. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2009లో పీఆర్పీలో చేరి పోటీచేసినా ఓటమే ఎదురైంది. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసినా గెలుపు దక్కలేదు. దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ నాయకత్వం అల్ట్రనేషన్ గా రాధాకు మచిలీపట్నం ఎంపీగా పోటీచేయమని కోరింది. దీంతో నాయకత్వంతో విభేదించిన రాధా టీడీపీలో చేరిపోయారు. ఎన్నికల క్యాంపెయినర్ గా పనిచేశారు. కానీ టీడీపీకి ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతున్నా యాక్టివ్ రోల్ లేదు.కేవలం తన తండ్రి జయంతి, వర్థంతి వేడుకలకే పరిమితమవుతూ వస్తున్నారు.

రాధా టీడీపీ నుంచి వేరే పార్టీలోకి వెళతారని ప్రచారం సాగింది. ముఖ్యంగా పవన్ నేతృత్వంలోని జనసేనలో చేరుతారని అంతా భావించారు. కానీ ఇప్పటికే తరచూ పార్టీలు మారతారన్న అపవాదు నేపథ్యంలో రాధా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీడీపీలోనే ఉండి రాజకీయంగా ఎదగాలని డిసైడ్ అయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రలో కలుసుకున్నారు. అడుగులో అడుగు వేసి అలరించారు. రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో రాధాకు ఏదో పెద్ద హామీ దక్కిందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే రాధా అనుచరులు మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కేటాయిస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు రుచించడం లేదు.
అటు రాధా వ్యవహార శైలిపై టీడీపీకి కూడా అభ్యంతరాలున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తరువాత రాధా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరైంది అరుదు. పైగా టీడీపీని, చంద్రబాబు కుటుంబాన్నితిట్టిపోసే కొడాలి నాని, వల్లభనేని వంశీలతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ఆ ఇద్దరు రాధా స్నేహాన్ని వాడుకొని టీడీపీకి డ్యామేజ్ చేశారన్న ఆరోపణలున్నాయి. పార్టీ హైకమాండ్ కు వ్యక్తిగతంగా ధ్వేషించే వారితో ఎలా సన్నిహితంగా గడుపుతారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే రాధా దివంగత వంగవీటి మోహన్ రంగా కుమారుడు కావడంతో, రాష్ట్రస్థాయిలో కాపు ఫ్యాక్టర్ ఓటింగ్ ను ప్రభావితం చేయడంతో చంద్రబాబు కూడా మెతక వైఖరిగా ఉండేవారు. కానీ ఇప్పుడు పార్టీకి ఆదరణ పెరుగుతుండడంతో రాధా పునరాలోచనలో పడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కేటాయించాలని చిన్నబాబుతో మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బొండా ఉమామహేశ్వరరావు అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాధా ఇప్పుడు టీడీపీలో చిచ్చుకు కార్నర్ అవుతున్నారు.