
ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలకు ప్రజాప్రతినిధుల అవసరం చాలా ఉంది. అయితే కొందరు నాయకులు కరోనా భయంతో ఇంటి గడప దాటని వారున్నారు.. కానీ మరికొందరు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. అయితే ఓ ఎమ్మెల్యే అర్ధరాత్రి అని తేడా లేకుండా తన దగ్గకు వచ్చిన సమస్యను పరిష్కరించేందుకు సమయాయత్తమవుతున్నారు. విదేశాల్లో ఉన్న ఓ యువతి తనకు ఆర్ధరాత్రి ఫోన్ చేసి తన సమస్యను చెప్పుకోవడంతో ఏమాత్రం విసుక్కోకుండా అప్పటికప్పుడు స్పందించి ఆమె తల్లిని కాపాడాడు.
కృష్ణ జిల్లా గన్నవరం ప్రాంతానికి చెందిన ఓ యువతి డెన్మార్క్ లో ఉంటోంది. ఆమె తల్లి దండ్రులు మాత్రం గన్నవరంలోనే ఉంటున్నారు. ఈ సమయంలో ఆమెకు వచ్చిన కష్టాన్ని తన నియోజకవర్గ ఎమ్మెల్యేకు చెప్పింది. కరోనాతో తన తండ్రి చనిపోయాడని, తన తల్లి పరిస్థితి విషమయంగా ఉందని తెలిపింది. అయితే హాస్పిటల్ లో జాయిన్ చేద్దామనుకుంటే ఎక్కడా బెడ్ దొరకడం లేదని ఆవేదన చెందుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకి తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే తనకున్న పరిచయాలతో ఆ యువతికి సాయం చేశాడు.
తనకున్న పరిచయాలతో విజయవాడలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎంక్వైరీ చేసి ఓ ఆసుపత్రిలో బెడ్ ఇప్పించాడు. సకాలంలో ఆమెకు చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వంశీ సోషల్ మీడియాలో చెప్పాడు. ఒక రాజకీయ నాయకుడిగా ఇలాంటి సేవ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన చెప్పాడు. డెన్మార్క్ నుంచి యువతి ఫోన్ చేయగానే తన తల్లికి బెడ్ ఇప్పించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
ఇక ఎమ్మెల్యే వంశీ తన సొంత నిధులతో ఆక్సిజన్ సిలిండర్లను అవరమైన వారికి అందిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కాలంలో చాలా మందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. దేశమొత్తంగా ఆక్సిజన్ కొరత ఉన్న సమయంంలో వంశీ ఇలాంటి సేవ చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. గన్నవరం సమీపంలోని చిన్నగుట్టపల్లి పిన్నమనేని కొవిడ్ ఆసుపత్రికి 70 సిలిండర్లను, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి 100 సిలిండర్లను, ఏపీ డీజీపీ కార్యాలయానికి 25 సిలిండర్లను, మచిలీ పట్నం ఆసుపత్రికి 25 సిలిండర్లను సొంత నిధులతో అందించారు.
అలాగే పిన్నమనేని కొవిడ్ ఆసుపత్రికి 50 ఆక్సోఫా మీటర్లను అందించారు. ఇక తన నియోజకవర్గంలోని ప్రజలు ఏదైనా అవసరం ఉండి స్పందిస్తే సకాలంలో ఆదుకుంటానని తెలుపుతున్నాడు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా నియంత్రణకు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.