దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు.. దేశం మొత్తానికి సరఫరా అయ్యేనాటికి ఎంత కాలం పడుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. దీంతో.. రాష్ట్రాలు విదేశాల బాట పడుతున్నాయి. ఈ మేరకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నాయి. అంటే.. అంతర్జాతీయంగా ఉన్న సంస్థలన్నీ బిడ్ దాఖలు చేస్తాయన్నమాట. ఏ వ్యాక్సిన్ సరఫరా చేస్తారు? ఎంతకు అందిస్తారన్న విషయాలను కోట్ చేస్తాయి. వాటిని ప్రభుత్వం పరిశీలించి, మెరుగైన కోట్ చేసిన సంస్థకు వ్యాక్సిన్ సరఫరా బాధ్యతలను అప్పగిస్తుంది.
ఇప్పటికే.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిషా వంటి రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లను పిలిచాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించింది. అటు ఏపీ సర్కారు కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అంతర్జాతీయంగా ఫైజర్, జైడస్ వంటి ప్రముఖ సంస్థలు ఈ టెండర్లకు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
వ్యాక్సిన్ సకాలంలో అందించి ఉంటే.. ఇంత మొత్తంలో మరణాలు సంభవించి ఉండేవి కాదనే వాదన బలంగా ఉంది. పలు అంతర్జాతీయ సంస్థలు, మీడియా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. దీంతో.. ఇక కేంద్రం నుంచి వ్యాక్సిన్ పెద్దగా వచ్చే అవకాశం లేదని భావిస్తున్న రాష్ట్రాలు.. తామే స్వయంగా రంగంలోకి దిగాయి. అయితే.. ఈ టెండర్లు ఎప్పుడు ముగుస్తాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ప్రజలకు ఎప్పుడు అందుతుంది? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వేలాది కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వాలు లాక్ డౌన్ చర్యలకు దిగుతున్నాయి. కాబట్టి.. పరిస్థితి మరింతగా విషమించక ముందే వ్యాక్సిన్ తెప్పించాలని, మరిన్నిప్రాణాలు పోకుండా చూడాలని జనం కోరుతున్నారు. మరి, ఈ గ్లోబల్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.