Uttam Kumar Reddy- Jagga Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇతర పార్టీలను బలహీనం చేసేందుకు తన అమ్ముల పొదిలోని అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. విపక్షాలను బలహీనపర్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. బీజేపీపై ఆయన ఇప్పటికే బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ఆ దెబ్బకు కమలదళం విలవిల్లాడుతోంది. ఇప్పుడు గులాబీ బాస్ కాంగ్రెస్‌పై ఫోకస్ పెట్టారు. హస్తంపై కొత్త అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ పార్టీ సీనియర్లను దూరం చేయడం ద్వారా పొలిటికల్ గేమ్ ఆడాలనుకుంటున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. ఉత్తమ్‌కమార్‌రెడ్డి, జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతారని దాదాపుగా అన్ని పార్టీల నేతలూ నమ్ముతున్నారు. దానికి ముహూర్తం దగ్గర పడిందని బీఆర్‌ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
కాంగ్రెస్‌ను వీడాలనుకుంటున్న ఉత్తమ్..
టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉండాలనుకోవడం లేదు. ఎవరో ఉరూ పేరూ లేని వాళ్లు ఉత్తమ్ పార్టీ మారుతున్నారని ప్రచారం ప్రారంభించగానే.. ఆయన దీని వెనుక తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత ఉన్నారని.. హైకమాండ్ చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తూ తెర ముందుకు వస్తున్నారు. ఆయన తీరు చూస్తే.. బీఆర్‌ఎస్‌లో చేరిపోవడానికి తొందరపడుతున్నారని అర్థమవుతుంది.
ఉత్తమ్ బాటలో జగ్గారెడ్డి..
ఇక ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడిగా ముద్ర ఉన్న జగ్గారెడ్డి కూడా ఆయన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాడు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి ఆయనకు ఉక్కపోతగానే ఉంది. ఓసారి తాను కాంగ్రెస్ పార్టీ సభ్యుడి కాదని కూడా చెప్పుకున్నారు.
చేరికే తరువాయి..
కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ సీనియర్ నాయకులైన ఉత్తమ్, జగ్గారెడ్డితో మంతనాలు జరిపినట్లు తెలిసింది. సరైన సమయం చూసి బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటారని అంటున్నారు. అయితే సీనియర్లను చేర్చుకుని కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు కానీ. వారి చేరిక వల్ల తమ పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న ఆలోచన చేయడంలేదని బీఆర్‌ఎస్ నేతలు గొణుక్కుంటున్నారు. కాంగ్రెస్ దరిద్రాన్ని తెచ్చుకుని మన నెత్తిపై పెట్టుకోవడం ఎందుకనేది ఎక్కువ మంది వాదన. గత ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇలాంటి సమయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చేర్చుకుని ఆయనకు.. ఆయన భార్యకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల తెలంగాణ బీఆర్‌ఎస్ మొత్తం డిస్ట్రర్బ్ అవుతుందని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జగ్గారెడ్డితో లాభం కన్నా నష్టమే ఎక్కువ..
ఇక జగ్గారెడ్డిని చేర్చుకుని బీఆర్‌ఎస్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందన్న వాదన బీఆర్‌ఎస్‌లో వినిపిస్తోంది. కాంగ్రెస్‌ను బలహీనం చేయడానికి అక్కడి నేతల్ని తీసుకుని తమ పార్టీని వర్గ పోరాటంలోకి నెట్టేసుకుంటున్నారన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వినిపిస్తోంది.
రాజకీయాల్లో తాము బలపడటం కన్నా ఒక్కోసారి ప్రత్యర్థిని బలహీనపర్చడం గొప్ప వ్యూహం అవుతుంది. కానీ ప్రత్యర్థిపై ఇలాంటి ప్లాన్ అమలు చేసే ముందుకు తమకు ఎఫెక్ట్ అవుతుందేమో పరిశీలించకపోతే ఆ వ్యూహం తమకే బూమరాంగ్ అవుతుంది. కాంగ్రెస్ సీనియర్ల విషయంలో కేసీఆర్ ప్లాన్ అలాంటిదేనని బీఆర్‌ఎస్ నేతలే అనడం గమనార్హం.