Afghanistan ISIS Bombers: అప్ఘనిస్తాన్ (Afghanistan)లో మరిన్ని ఐసిస్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు జరుగవచ్చని నిన్ననే అమెరికా (US) అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) ప్రకటించాడు. అంతే వేగంగా ఐసిస్ ఉగ్రవాదులు కాబూల్ లో ఎయిర్ పోర్టులో మరో భారీ దాడి చేయడానికి రాగా సకాలంలో గుర్తించిన అమెరికా సైన్యం డ్రోన్లతో దాడి చేసి హతమార్చేసింది. దీంతో కాబూల్ లో మరో మారణహోమం తృటిలో తప్పింది.
కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ వద్ద ఈసారి అంతకుమించిన విధ్వంసం చేయాలని ఒక కారులో భారీ పేలుడు సామాగ్రితో ఐసిస్ ఉగ్రవాదులు ఎయిర్ పోర్ట్ కు బయలు దేరారు. ఉగ్రవాదులు పన్నిన కుట్రను కనిపెట్టిన అమెరికా భగ్నం చేసింది. దాడి చేసేందుకు కారులో వస్తున్న ఐసిస్ ఆత్మాహుతి దళ సభ్యులను ముందే గుర్తించి మట్టుబెట్టింది. ఈ క్రమంలోనే విమానాశ్రయానికి సమీపంలో రాకెట్ దాడి జరిగింది. అందులో ఓ చిన్నారి చనిపోయింది.
ఈ కారుపై డ్రోన్లతో అమెరికా బాంబులు వేయడంతో భారీ విస్పోటనం సంభవించింది. ఐసిస్ ఉగ్రవాదులు ఆల్ రెడీ కారులో భారీ పేలుడు పదార్థాలు తీసుకురావడం.. దానిపై అమెరికా బాంబులు వేసి పేల్చేయడంతో మరింత పెద్ద పేలుడు సంభవించింది.కారు తునాతునకలైంది.
ఇక అప్ఘన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదించామని.. వారిని తిరుగుబాటు దారులను ఏమీ అనమని అన్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. బగ్లాన్ ప్రావిన్సులోని అందారాజ్ లోయలో ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్ అందారాబీని క్రూరంగా చంపేశారు. ఫవాద్ ఇంటికెళ్లిన తాలిబన్లు అందరూ చూస్తుండగానే అతడిని కాల్చి చంపారు. ఫవాద్ హత్యను ఐక్యరాజ్యసమితి, అమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఖండించాయి.
ఇప్పటికే తాలిబన్లు అప్ఘన్ లో అరాచకానికి తెరలేపారు. మహిళలు చదువుకునేందుకు ముందు ఒప్పుకొని ఇప్పుడు నిషేధించారు. తాజాగా కాందహార్ లో టీవీలు, రేడియో చానెళ్లలో సంగీతాన్ని నిషేధించారు. మహిళలు ఎవరూ వీటిలో కనిపించకూడదని హుకూం జారీచేశారు.
ఇక అప్ఘనిస్తాన్ లోని తాలిబన్లకు ఇప్పటికీ చిన్న ఉత్తరంలో ఉన్న పంజ్ షేర్ కు తాలిబన్లు షాకిచ్చారు. అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పంజ్ షేర్ లోనే అప్ఘన్ తాజా మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఉన్నారు. వారు ఆన్ లైన్ ద్వారా అప్ఘన్ లో జరిగే తాలిబన్ల దురాగతాలను షేర్ చేస్తుండడంతో ఈ పనిచేశారు. ఎప్పుడైనా పంజ్ షేర్ పై దాడి చేసి స్వాధీనం చేసుకునేందుకు చుట్టుపక్కల మోహరించారు.