
అప్ఘానిస్తాన్ లో అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశంలోని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఐసిస్ శిబిరాలనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసింది. నిన్న కాబూల్ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి చేసి 103 మందిని చంపిన ఐసిస్ కు తగిన బుద్ది చెప్పింది.
కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 13మంది అమెరికా సైనికులతోపాటు సుమారు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించుకుంది. దీనికి ప్రతీకారంగా అమెరికా తాజాగా ఐసిస్ శిబిరాలపై వైమానిక దాడులు చేసింది.
కాబూల్ విమానాశ్రయం వెలుపల దాడిలో మరణించిన అమెరికన్ సైనికులకు నివాళులర్పించిన అధ్యక్షుడు జోబైడెన్ పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వేటాడి, మట్టుబెట్టడం తథ్యమని ప్రతిజ్ఞ చేశారు. ప్రతీకారం తప్పదన్నారు.
ఈ క్రమంలోనే అమెరికన్ కమాండర్లకు ఐసిస్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అమెరికా వైమానిక దాడులకు దిగింది. కాబూల్ దాడి జరిగి 48 గంటలు గడవకముందే ప్రతీకారం దిశగా అడుగులు వేసింది. అప్ఘనిస్తాన్ లోని నంగహర్ లో ఐసిస్ శిబిరంపై వైమానిక దాడి చేసింది.