UPSC Prelims Result 2025: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మే 25న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితాను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేసింది.
మెయిన్స్ దరఖాస్తు ప్రక్రియ వివరాలు
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు రూ.200 రుసుము చెల్లించి యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మహిళలు, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుము నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తుల స్వీకరణ కోసం జూన్ 16 నుంచి 25 వరకు ప్రత్యేక విండోను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఫలితాలపై కీలక సమాచారం
మార్కులు, కటాఫ్ వివరాలు: అభ్యర్థుల మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీలను ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
పెండింగ్ ఫలితాలు: కోర్టు కేసుల కారణంగా నలుగురు అభ్యర్థుల ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు యూపీఎస్సీ తెలిపింది.
ఐఎఫ్‌ఎస్ ఫలితాలు: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విడిగా విడుదల చేశారు.
సమాచారం కోసం..
ఫలితాలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా వివరణల కోసం అభ్యర్థులు ఢిల్లీలోని షాజహాన్ రోడ్డులో ఉన్న యూపీఎస్సీ ఎగ్జామినేషన్ హాల్ భవనంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కౌంటర్‌ను సంప్రదించవచ్చు. కౌంటర్ పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే, 011–23385271, 011–23098543, 011–23381125 నంబర్ల ద్వారా ఫోన్‌లో సంప్రదించవచ్చు.
అభ్యర్థులకు సూచనలు
మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీ సూచించింది. ఫలితాలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (upటఛి.జౌఠి.జీn)లో అందుబాటులో ఉన్నాయి.
యూపీఎస్సీ సివిల్స్, ఐఎఫ్‌ఎస్ ప్రిలిమినరీ 2025 ఫలితాల విడుదలతో అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష వైపు అడుగులు వేస్తున్నారు. పారదర్శకతతో కూడిన ఈ ప్రక్రియ అభ్యర్థులకు స్పష్టమైన మార్గాన్ని సూచిస్తోంది.