BrahMos upgrade: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత శక్తి ప్రపంచానికి తెలిసింది. ఇదే సమయంలో మిత్రులు ఎవరో.. శత్రువులు ఎవరో భారత్‌కు అర్థమైంది. మన చుట్టూనే శత్రువులు ఉన్నారని గుర్తించిన భారత్.. ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త టెక్నాలజీతో ఆయుధాలు రూపొందిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో కీలకపాత్ర పోసించిన బ్రహ్మోస్ క్షిపణిని మరింత శక్తివంతంగా మారుతోంది. శబ్ద వేగాన్ని మించిపోయే బలమైన సూపర్‌సోనిక్ మిసైల్ ఇది. శత్రు శిబిరాలను క్షణాల్లో ధ్వంసం చేసే దీనిది ప్రత్యేకత. ఇప్పుడు భారత రక్షణ శాస్త్రవేత్తలు దాని దూరప్రయాణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశలో ముందుకెళ్తున్నారు.
800 కిలోమీటర్ల లక్ష్యసాధన
ప్రస్తుతం ఉన్న 450 కిలోమీటర్ల పరిధిని 800 కిలోమీటర్లకు విస్తరించేందుకు పరీక్షలు జరుగుతున్నాయి. కొత్త వేరియంట్‌ను 2027 నాటికి సైనిక వినియోగంలోకి తెచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. దాదాపు అన్ని హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్లు పూర్తయి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ నావిగేషన్ సిస్టమ్ పరీక్షల దశలో ఉంది. ఈ పరీక్షలు విజయవంతమైతే, బ్రహ్మోస్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఎయిర్–టు–సర్ఫెస్ ఆయుధాలలో ఒకటిగా మరింత స్థానం సంపాదిస్తుంది.
నేవీతో ఆరంభం..
సముద్ర ఆధారిత బ్రహ్మోస్ వెర్షన్‌తో మొదట ఈ సాంకేతిక రూపాంతరం మొదలుకానుంది. నౌకాదళానికి ఉపయోగించే ఫైర్ కంట్రోల్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆధారంగా రేంజ్ పెంపు సాధ్యమవుతుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్మీ వేరియంట్‌ను తరువాత, చివరగా వాయుసేనకు అనువైన మోడల్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇదే సమయానికి ఆయుధ మోడ్యూల్‌లో పెద్దగా మార్పులు చేయకుండా సామర్థ్యం పెంపు సాధనమే ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఆకాశ యుద్ధానికి ‘అస్త్ర’
ఇక గగనతలంలో భవిష్యత్ యుద్ధానికి సిద్ధమవుతూ, ‘‘అస్త్ర’’ సిరీస్ క్షిపణుల శక్తివృద్ధి వేగంగా సాగుతోంది. అస్త్ర మార్క్–2 పనితీరును 160 నుంచి∙280 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించనున్నారు. కొత్త రామ్‌జెట్ ఇంజిన్‌తో నిర్మితమవుతున్న అస్త్ర మార్క్–3 350 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉండనుంది. ఈ క్షిపణులు బియాండ్ విజువల్ రేంజ్ యుద్ధ పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. భారత వాయుసేన, సుఖోయ్–30 ఎంకేఐ, తేజస్ యుద్ధవిమానాల్లో వీటిని అమర్చే ప్రణాళికలో ఉంది.
ఈ కొత్త పరిణామాలతో భారత్‌కి విదేశీ దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గనుంది. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌ల వంటి దేశాల నుంచి బీవీఆర్ ఆయుధాల దిగుమతి తగ్గి, స్వదేశీ అభివృద్ధికి బలం చేకూరుతుంది. దీని వల్ల భారత్ ‘రక్షణాత్మక స్వయం సమృద్ధి‘ దిశగా మరొక అడుగు ముందుకేసినట్లవుతుంది.