UP education department strange orders: ప్రభుత్వ టీచర్ అంటేనే ప్రస్తుతం ఓ చులకన భావన ఉంది. చదువు సరిగా చెప్పరనే అపవాదు ఉంది. ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో అయితే టీచర్ల చదువులపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక కాపీలు కొట్టి కొలువులు తెచ్చుకున్నారన్న అప్పవాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యతిరేక భావన ఉన్న నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలియా ప్రభుత్వ టీచర్లకు విద్యాశాఖ జారీ చేసిన విచిత్రమైన ఆదేశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వీధి పశువులు (ఆవులు) కోసం ప్రతీ బ్లాక్ నుంచి కనీసం 100 క్వింటాళ్ల పశుగ్రాసం సేకరించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించడం టీచర్లను తీవ్రంగా కలచివేసింది. తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వచ్చిన తర్వాత అధికారులు ‘‘ఇది తప్పనిసరి కాదు’’ అంటూ వెనక్కి తగ్గారు. అయినా ఈ ఘటన రాజకీయాలు, పాలన, విద్యారంగంపై చాలా ప్రశ్నలు లేవనెత్తింది.
ఏమిటి ఆ ఆదేశం?
బరేలీ జిల్లా ప్రాథమిక విద్యా శాఖ (బేసిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్) ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వుల ప్రకారం ప్రతీ ప్రాథమిక పాఠశాల నుంచి సుమారు 46 కిలోల గడ్డి సేకరించాలి. ప్రతి బ్లాక్ నుంచి కనీసం 100 క్వింటాళ్లు (మొత్తం జిల్లాలో సుమారు 1,500 క్వింటాళ్లు) సేకరించి గోశాలలకు అందించాలి. జనగణన డ్యూటీతో పాటు ఈ బాధ్యత కూడా నిర్వర్తించాలి అని, ఆదేశాలు పాటించకపోతే చర్యలు ఉంటాయని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ ఆదేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ‘‘ఇక మరి గోబర్ కూడా పని చేయాలా?’’ అని ప్రశ్నించారు. తీవ్ర విమర్శలు, మీడియా దృష్టి పడడంతో అధికారులు త్వరగా వెనక్కి తగ్గారు. ‘‘ఇది స్వచ్ఛంద దానం మాత్రమే, తప్పనిసరి కాదు’’ అని స్పష్టం చేశారు. అయితే, మొదట ఆదేశంలో ‘‘చర్యలు తప్పవు’’ అని హెచ్చరించడం ఎందుకు అనే ప్రశ్న తెలెత్తుతోంది.
సమస్య ఎక్కడ ఉంది?
ప్రభుత్వ టీచర్లు ఇప్పటికే ఎన్నికల డ్యూటీ, జనగణన, సర్వేలు, వ్యాక్సినేషన్, రేషన్ కార్డు పనులు వంటి అనవసర బాధ్యతలతో మునిగిపోతున్నారు. ఫలితంగా పాఠశాలల్లో నాణ్యమైన బోధన, విద్యార్థుల అభివృద్ధి వెనుకబడుతోంది. ఇప్పుడు గడ్డి సేకరణ కూడా జోడించడం అనవసరం. వీధి పశువుల సమస్య నిజమే. కానీ దానికి పరిష్కారం టీచర్ల భుజాల మీద మోపడం కాదు. గోశాలల నిర్వహణ, ఫండింగ్, స్థానిక స్వయం సహాయక సంఘాలు, పశు సంవర్ధన శాఖ – ఇవి బాధ్యత వహించాలి. టీచర్లను ఉపయోగించడం సులభమైన మార్గంగా కనిపిస్తోంది.
విద్యారంగంపై ప్రభావం..
గోవు సంరక్షణ రాజకీయ అజెండాలో భాగం. కానీ అది అమలు చేసేటప్పుడు విద్యారంగాన్ని బలి ఇవ్వడం సమంజసం కాదు. ఉత్తరప్రదేశ్‌లో గతంలో కూడా టీచర్లను గోశాలలకు ఫండ్ ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి. ఇది ఆ సిలసిలాలో భాగమే. టీచర్ల మనోస్థైతి మరింత దిగజారుతుంది. పాఠశాలల్లో బోధన నాణ్యత క్షీణిస్తుంది.
బరేలీ ఘటన ఒక హాస్యాస్పద సంఘటనగా కనిపించినా, ఇది లోతైన సమస్యను బయటపెడుతోంది. ప్రభుత్వాలు టీచర్లను ‘‘మల్టీపర్పస్ వర్కర్స్’’గా చూడడం మానాలి. వారి ప్రధాన బాధ్యత విద్యాబోధన మాత్రమే కావాలి. గోవు సంరక్షణ మంచి ఉద్దేశమే కానీ, దాని భారం విద్యారంగం మీద పడకూడదు. సమస్యలకు సరైన సంస్థల ద్వారా, సరైన వనరులతో పరిష్కారాలు వెతకాలి. లేకపోతే ఇలాంటి ‘‘గడ్డి సేకరణ’’ ఆదేశాలు రాజకీయ, పాలనా వ్యవస్థలను మరింత హాస్యాస్పదం చేస్తాయి.
