UP CM Responds To Student Request: ఓ విద్యార్థికి సైకిల్ తొక్కలానేది కోరిక.. కాకపోతే అతడి కుటుంబ ఆర్థిక నేపథ్యం దానికి సహకరించదు. పైగా వారి తండ్రికి సైకిల్ కొనుగోలు చేసే శక్తి లేదు. ఇక మరో విద్యార్థికి పాఠశాలలో చదువుకోవాలని కోరిక. అయితే ఈ ఇద్దరు చిన్నారుల కోరికలను ముఖ్యమంత్రులు తీర్చేశారు.
సాధారణంగా ఈ రోజుల్లో వార్డ్ కౌన్సిలర్ ను కలవడమే పెద్ద కష్టం. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రులనే ఈ ఇద్దరు చిన్నారులు కలిశారు. తమ మనసులో ఉన్న కోరికను ఎటువంటి భయం లేకుండా ముఖ్యమంత్రులకు చెప్పేశారు. చిన్నారులు ఎటువంటి మొహమాటం లేకుండా అడగడం.. పైగా వారి చిన్న చిన్న మాటలకు ముఖ్యమంత్రులు ఫిదా అయిపోయారు. వారు కోరుకున్న కోరికలను నెరవేర్చారు. వారు అడిగింది క్షణంలో అందించారు. దీంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేవు. అంతేకాదు ఇన్నాళ్లుగా తమకు అందని ద్రాక్షగా ఉన్నది.. ఒక్కసారిగా కాళ్ల ముందుకు రావడంతో ఆ చిన్నారులు ఎగిరి గంతులు వేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో అధికారిక పర్యటనలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ విద్యార్థి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థితో ముఖ్యమంత్రి సంభాషించారు. ఈ క్రమంలోనే తనకు చదువుకోవాలని కోరిక ఉందని.. తనకు పాఠశాలలో అడ్మిషన్ కావాలని ఆ విద్యార్థి కోరాడు. అతడి కోరికను మన్నించిన ముఖ్యమంత్రి యోగి.. వెంటనే దానికి సంబంధించిన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఒక పెద్ద పాఠశాలలో ఆ విద్యార్థికి అడ్మిషన్ దక్కేలా చేశారు యోగి. ఇదే విషయాన్ని ఆ విద్యార్థికి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతో .. ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేవు.
ఇక అస్సాం ముఖ్యమంత్రి హిమంత ను ఓ బాలుడు కలిశాడు. అతడి తండ్రికి అంతంత మాత్రమే ఆర్థిక స్థితి ఉంది. సైకిల్ కొనుగోలు చేసే డబ్బులు లేవు. ఇదే విషయాన్ని ఆ విద్యార్థి అస్సాం ముఖ్యమంత్రి హిమంత దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి హిమంత వెంటనే.. సైకిల్ కొనుగోలు చేసి ఆ విద్యార్థికి అందించారు. దీంతో ఆ విద్యార్థి ఎగిరి గంతులు వేశాడు.. సైకిల్ ను చూసి ఆనందతాండవం చేశాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన ఈ పని సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా విమర్శలు ప్రతి విమర్శలతోనే ఆగిపోకూడదని.. ఇలాంటి పనులు చేస్తే ప్రజల లో మరింత మన్నన పొందవచ్చని నెటిజన్లు సూచిస్తున్నారు.
వాస్తవానికి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు. పైగా ఈ రాష్ట్రాలు కూడా భద్రతపరంగా అత్యంత సున్నితమైనవి. అందువల్లే యోగి, హిమంత అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలో ఉంటారు. అయినప్పటికీ వీరిద్దరిని ఆ ఇద్దరు విద్యార్థులు కలవడం.. తమ మనసులో ఉన్న కోరికలను చెప్పడం.. దానికి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు స్పందించడం.. వెంటనే వాటిని నెరవేర్చడం విశేషం.