కన్నవారి గురించి ఎన్నో కలలు కంటుంటారు తల్లిదండ్రులు. తమ కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అందరిలో మంచివాడుగా పేరు తెచ్చుకోవాలని భావిస్తుంటారు. ఆ తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచించారు. కానీ వారి ఆశలు అన్ని నెరవేరాయి. కొడుకుకు వారు ఊహించినట్లే మంచి ఉద్యోగం, మంచి వేతనం, మంచి స్థానంలో ఉన్నడని సంతృప్తి చెందారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో తమ కొడుకు అదృశ్యమయ్యాడు. రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. అయినా అతని ఆచూకీ దొరకడం లేదు. వారి నిరీక్షణ తీరడం లేదు. కన్న కొడుకు ఏమయ్యాడో అనే ఆందోళన తప్ప వేరే ఏ సమాధానం వారికి అందడం లేదు.
ఈ నేపథ్యంలో వారి కొడుకు ఏమయ్యాడు అనే దానిపై ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతోంది. గుంటూరు జిల్లాకు చెందిన మైరెన్ ఉద్యోగి శ్రీనివాస్ చెన్నైలోని సీవర్టీ మారిటైమ్ కంపెనీలో సెయిలర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో ఉండగానే మే 24 నుంచి కనిపించడం లేదు. శ్రీనివాస్ అదృశ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడికి విశాఖ పట్నం కు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. శ్రీనివాస్ కొంతకాలం ఆమెతో చనువుగా ఉన్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఆ యువతితో పాటు శ్రీనివాస్ స్నేహితుడు రాజేంద్రకు కూడా అతడి గురించిన సమాచారం తెలిసి ఉంటుందని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు సైతం సమర్పించామని చెబుతున్నారు. వారిద్దరిని విచారించి తమ కొడుకు ఆచూకీ కనుగొనాలని వారు కోరుతున్నారు. శ్రీనివాస్ సముద్రంలో ఉన్నప్పుడు అదృశ్యమైనందునే కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. శ్రీనివాస్ కనిపించకుండా పోయి రెండు నెలలు గడిచినా ఎలాంటి ఆధారాలు లభించడం లేదని చెబుతున్నారు.
శ్రీనివాస్ అదృశ్యంపై వైజాగ్ యువతి అతని కుటుంబ సభ్యులపైనే అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి కావాల్సిన తమ కొడుకు కనిపించకుండా పోయి రెండు నెలలు గడిచినా ఎలాంటి ఆధారం లేకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు, నేతలు చొరవ చూపి తమ కొడుకు అదృశ్యం మిస్టరీని చేధించి తమ బాధ తీర్చాలని వారు కోరుతున్నారు.