
ఉన్నావ్ అత్యాచార కేసుకు సంబంధించి దోషి కుల్ దీప్ సెంగార్ కు ఢిల్లీ కోర్టు మరో షాక్ ఇచ్చింది. కేసులో పదిసంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే ఉన్నావ్ అత్యాచార కేసులో సెంగార్ కు యావజ్జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే.. అత్యాచార బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మరణించిన కేసులో మరో 10ఏళ్ళ జైలు శిక్ష విధించింది కోర్టు. కుల్ దీప్ సెంగార్ ను అరెస్టు చేయడానికి బదులుగా ఉన్నావో పోలీసులు అక్రయ ఆయుధాల కేసులో బాధితురాలి తండ్రిని అరెస్టు చేసి, చిత్రహింసల పాలుజేశారు. దీంతో బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలోనే మరణించారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు, సెంగార్ కు, అతని తమ్ముడికి పదేళ్ల జైలు శిక్ష, పదిలక్షల జరిమానా విధించింది. బాధితురాలి కుటుంబానికి దోషులిద్దరూ చెరో పదిలక్షలు చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.
2019 జులైలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. జైళ్లో ఉన్న తన బంధువును కలుసుకోడానికి లాయర్, కుటుంబసభ్యులతో వెళ్తున్న ఆమె వాహానాన్ని ట్రక్కుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, బాధితురాలు, లాయర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసును ఢిల్లీకి బదిలీచేసి.. బాధితులను వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ లో సఫ్దర్జంగ్ హాస్పిటల్ కు తరలించారు.