Union Minister Shobha Karandlaje: ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దివాళా దిశగా అడుగులేస్తోంది. గత ప్రభుత్వాలు అప్పులు చేసినా.. వాటికి మించి వైసీపీ సర్కారు అప్పులు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలకోసమంటూ రాష్ట్రం రిజర్వు బ్యాంకు సహా పలు ఆర్ధిక సంస్ధల దగ్గర భారీగా అప్పులు చేస్తోంది. వీటికోసం మద్యంపై భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టే పరిస్దితికి వచ్చేసింది. దీనిపై ఓవైపు విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలో పర్యటిస్తున్న కేంద్రమంత్రులు కూడా దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అనంతపురానికి వచ్చిన మంత్రి శోభా కరంద్లాజే జగన్ సర్కార్ పై నిశిత విమర్శలు చేశారు.
ముఖ్యంగా జగన్ సర్కార్ చేస్తున్న అప్పులు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పరిపాలన చేతకాక ఆంధ్రప్రదేశ రాషా్ట్రన్ని అప్పులమయం చేశారని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావడంతో పాటు రాష్ట్రాన్ని అవినీతిమయం చేసేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో నవరత్నాలు ఇస్తున్నామని చెప్పుకుంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందన్నారు. సొంతంగా ఎలాంటి అభివృద్ధి చేయకపోగా కేంద్రం ఇచ్చే నిధులకు తమ స్టిక్కర్లు వేసుకుంటూ మోసం చేస్తున్నారన్నారు. దేశంలోనే ఏపీని మోస్ట్ కరెప్షన్ రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు.
కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ లు, రేషన్ బియ్యాన్ని అందించి పేదలను ఆదుకుందన్నారు. వాటికి కూడా తామే ఇచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం కలరింగ్ ఇచ్చుకుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏం అభివృద్ధి చేసిందో… ఎక్కడ చేసిందో చెప్పాలని సీఎం జగన్ ను ఆమె ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన ప్రతి పథకానికి సంబంధించిన నిధుల వ్యయం… జగన్ సర్కార్ ఖర్చు ఎక్కడ, ఎంత ఖర్చు పెట్టారో లెక్కలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. మొత్తం నిధులన్నీ వెనక్కు తీసుకునే సమయం ఆసన్నమైందన్నారు. విద్యార్థులకు ఆసరాగా ఉన్న ఎన్నో పథకాలను నిర్వీర్యం చేసి పేద విద్యార్థులను జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రం బాగుపడాలంటే సీఎం జగన్ ను సాగనంపాల్సిందే అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ఆమె పిలుపునిచ్చారు.
జగన్ పాలన అప్పులు, అవినీతితో పరాకాష్టకు చేరుకుందని, ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వ లేదని, రాష్ట్రానికి వస్తున్న ఆదాయమంతా ఎటు పోతోందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయమంతా విదేశాలకు తరలిపోతోందా అని శోభా కరంద్లాజే అనుమానం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో జగన్ సర్కార్ పోలీసులకు జీతాలు కూడా ఇవ్వలేని స్ధితిలో ఉందని శోభా కరంద్లాజే విమర్శించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఒక్క కాలేజీ అయినా కట్టారా ? ఒక్క రోడ్డు అయినా వేశారా ? అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎంపీ లేకపోయినా ప్రధాని మోడీ మాత్రం రాష్ట్రానికి నిధులు ఇస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 6 ఎయిమ్స్ లో భాగంగా ఏపీలోని మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ను జూలై 4న ప్రధాని మోడీ ప్రారంభిస్తారని శోభా వెల్లడించారు.
Also Read:AB Venkateswara Rao: జగన్ తో ఫైట్.. అతడే గెలిచాడు..