Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలని భావించడం లేదన్నారు. దీంతో కేంద్రం వెనక్కు తగ్గిందా అన్న చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిన కేంద్రం, తాజాగా ఆలోచన లేదనడం కేసీఆర్ ఎఫెక్టేనా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్లాంట్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి..
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే గురువారం సందర్శించారు. నగరంలోని పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫగ్గన్‌సింగ్ కులస్తే మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు. దానికంటే ముందు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం. స్టీల్ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టాం. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతోంది. దీనిపై ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం. ఆర్‌ఐఎన్‌ఎల్ అధికారులతో భేటీ అవుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనడం ఓ ఎత్తుగడ మాత్రమే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కొంతకాలంగా ఆందోళన..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై గతకొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించడంతోనే కేంద్రం వెనక్కు తగ్గిందా అన్న చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. మంత్రి ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటని, జగన్ ఖాతాలో క్రెడిట్ వేయడానికి కేంద్రం ఈ ప్రకటన చేసిందా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కేంద్రమంత్రి ప్రకటనకు కట్టుబడి ఉంటుందా.. ఢిల్లీ వెళ్లాక మరో ప్రకటన వస్తుందనా అన్న చర్చ కూడా జరుగుతోంది.