కరోనా వైరస్ వ్యాప్తి కీలక పదవులలో ఉన్నవారిని సహితం ఆందోళనకు గురిచేస్తున్నది. కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి. మురళీధరన్ అయితే స్వీయ గృహ నిర్భంధంకు పరిమితం అయ్యారు. కేరళలోని త్రివేండ్రంలో మంత్రి మురళీధరన్ తన ఇంటి నుండి గత రెండు రోజులుగా బైటకు రావడం లేదు.
మార్చి 14న త్రివేండ్రంలోని ఓ మెడికల్ కాలేజీలో నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరైన ఓ డాక్టర్‌కు కరోనా సోకినట్లు మార్చి 15న నిర్ధారణ అయింది. డాక్టర్ స్పెయిన్ నుంచి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో అనుమానంతో మురళీధరన్ కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. కానీ కేంద్ర మంత్రికి కరోనా నెగిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలనుకున్నారు కేంద్ర మంత్రి.
కేరళలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 24 నమోదు కాగా, ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. మరో ముగ్గురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 126కి చేరుకుంది.