Sonia Gandhi: ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతున్న నరేంద్ర మోడీ లో ఇంకా ఆ కసి చల్లారనట్టుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విచారించిన ఈడీ అధికారులు ఆ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మీడియాకు లీకులు ఇవ్వడం లేదు గాని తెరవెనుక మాత్రం ఏదో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన కీలకమైన ఆర్థిక స్తంభాలను కూలగొట్టేందుకే తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి బిజెపి మరింత దూకుడుగా వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ చిన్న లొసుగును కూడా వదలడం లేదు. పైగా రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఏమాత్రం అడ్వాంటేజ్ దక్కకుండా బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ప్రజా కోర్టులో సోనియా గాంధీ కుటుంబాన్ని దోషిగా నిలబెట్టేందుకు ఇప్పుడు బిజెపికి మరో అవకాశం వచ్చింది. సోనియా గాంధీ ట్రస్టులకు ఎఫ్సీఆర్ఏ లైసెన్సులు రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. నిధుల దుర్వినియోగం, మనీ లాండరింగ్ ఆరోపణలు, ఆర్ జి ఎఫ్, ఆర్ జి సి టి రెండింటికి సోనియానే చైర్ పర్సన్ గా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోం శాఖ వెల్లడించింది.

అసలు ఏమిటి ఈ వివాదం
రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ లకు సోనియాగాంధీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే పై సంస్థలకు వస్తున్న విరాళాలు, ఆదాయ పన్ను రిటర్న్ దాఖలులో పత్రాలు తారుమారు చేయడం, చైనా సహా వివిధ దేశాల నుంచి విరాళాల రూపంలో వచ్చే నిధుల దుర్వినియోగం, మనీ లాండరింగ్ తదితర ఆరోపణలపై విచారణ అనంతరం ఈ ఎన్జిఓ ల లైసెన్సులు రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొన్నది. 1991లో ఏర్పాటైన ఆర్జీఎఫ్ నకు ట్రస్టీలుగా మన్మోహన్ సింగ్, చిదంబరం, ప్రియాంక గాంధీ తదితరులు ఉన్నారు. ఆర్జిసిటీని 2022లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు ఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలో రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఉన్న జవహర్ భవన్ నుంచి పనిచేస్తున్నాయి. 2020లో భారత్, చైనా సైనికుల మధ్య లద్దాఖ్ లో ఘర్షణలు జరిగిన సమయంలో ఆర్జిఎఫ్ పై బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా పలు ఆరోపణలు చేశారు. దేశ భద్రతకు భంగం కలిగించే కొన్ని అధ్యయనాలు చేపట్టేందుకు, స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆర్జిఎఫ్ న కు 2005- 2006 మధ్యకాలంలో దాదాపు మూడు లక్షల డాలర్లు చైనా నుంచి విరాళంగా అందాయన్నారు. నిధులతో ఏ అధ్యయనాలు నిర్వహించారో కాంగ్రెస్ నేతలు వెల్లడించాలని అప్పట్లో ఆయన డిమాండ్ చేశారు. అలాగే పిఎంఆర్ఎఫ్ నుంచి ఆర్జిఎఫ్ కు నిధులు మళ్లించారని, పరారీలో ఉన్న వ్యాపారవేత్త మోహుల్ చోక్సి నుంచి ఈ సంస్థకు విరాళాలు వచ్చాయన్నారు. ఆర్జిఎఫ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న 2005-06 వార్షిక నివేదిక ప్రకారం ఈ ఫౌండేషన్ కు నిధులు అందించిన దేశాల జాబితాలో చైనా కూడా ఉంది.
ఎవరి వాదనలు వారివే
సోనియా గాంధీ ట్రస్టులకు ఎఫ్సిఆర్ఏ లైసెన్సుల రద్దు నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. రెండు ఎన్జీవోల ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేయడాన్ని బిజెపి నాయకులు స్వాగతిస్తున్నారు. గాంధీ కుటుంబం, వారు నడుపుతున్న సంస్థలు చట్టానికి అతీతం కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయం గాంధీ కుటుంబ అవినీతిని బహిర్గతం చేసిందని వారు పేర్కొంటున్నారు.

ఇదే సమయంలో “ఎస్” బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ సహా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురితో పాటు వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్, చైనా రాయబార కార్యాలయం నుంచి కూడా ఆర్జీఎఫ్ విరాళాలు స్వీకరించిందని వారు వివరిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా అక్కడ గాంధీ కుటుంబం ఉంటుందని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఇక దీనిపై కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆర్ జి ఎఫ్, ఆర్ జి సి టి లకు ఎఫ్ సి ఆర్ ఎ లైసెన్సులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రూపాయి పతనం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.