https://oktelugu.com/

Union Budget 2024: ఆరోగ్యానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం.. భారీగా తగ్గనున్న ఆ మందుల ధరలు!

కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను మంగళవారం(జూలై 23న) ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పేద, మధ్యతరగతి, కార్మికులు, ఉద్యోగుల అనేక ఆశల నడుమ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. ఈ బడ్జెట్‌లో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 24, 2024 / 09:40 AM IST

    Union Budget 2024

    Follow us on

    Union Budget 2024: పేదలు, మధ్య తరగతి ప్రజల, వేతన జీవుల ఆకాంక్షలు నెరవేర్చడం.., వికసిత్‌ భారత లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. వ్యవసాయరంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలికరంగం, పరిశోధన–ఆవిష్కరణలు, తయారీ, సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ప్రారంభోపన్యాసంలో చెప్పినట్లుగానే ఈ బడ్జెట్‌లో ఆరోగ్యానికి అధిక ప్రాధన్యం ఇచ్చారు. గతం కంటే ఈసారి బడ్జెట్‌ కేటాయింపులు పెంచారు. ఆరోగ్య శాఖకు రూ.90,958,63 కోట్లు కేటాయించారు. 2023–24 ఆర్ధిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకు 80,517.62 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే 12.96 శాతం అధికం.

    క్యాన్సర్‌ రోగులకు ఊరట..
    కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే కీలకమైన మూడు ఔషధాలపై కస్టమ్‌ డ్యూటీనిపూర్తిగా ఎత్తివేశారు. గతంలో 10 శాతం ఉన్న డ్యూటీని సున్నాకు తగ్గించారు. అదేవిధంగా మెడికల్‌ ఎక్స్‌–రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్రే ట్యూబ్‌లు, ప్లాట్‌ ప్యానల్‌ డిటెక్టర్లపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీలో మార్పులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు.

    కేటాయింపులు ఇలా..

    – ఆయూష్‌ మంత్రిత్వ శాఖకు బడ్జెట్‌ను రూ.3 వేల కోట్ల నుంచి రూ.3,712 కోట్లకు పెంచారు.

    – ఆరోగ్య శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్లో.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.87,656.90 కోట్లు కేటాయించారు. ఆరోగ్య పరిశోధన శాఖకు రూ.3,301.73 కోట్లు ప్రతిపాదించారు.

    – కేంద్ర ప్రాయోజిత పథకాలలో జాతీయ హెల్త్‌ మిషన్‌ కార్యక్రమానికి బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయి. గతంలో 31,550.87 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.36 వేల కోట్లకు దానిని పెంచారు.

    – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ.7,300 కోట్లు కేటాయించారు.

    – నేషనల్‌ టెలీ మెంటల్‌ హెల్త్‌ కార్యక్రమానికి కేటాయింపులు రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు బడ్జెట్ను పెంచారు.

    – నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌కు రూ.200 కోట్లు కేటాయించారు.

    – స్వయం ప్రతిపత్తి గల ఆరోగ్య సంస్థల బడ్జెట్‌ను రూ.17,250.90 కోట్ల నుంచి రూ.18,013.62 కోట్లకు పెంచారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు రూ.4,523 కోట్లు కేటాయించారు.

    – ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌కు కేటాయింపులు రూ.2,295.12 కోట్ల నుంచి రూ.2,732.13 కోట్లకు పెరిగాయి.