Chandrababu And Narayana Case: అమరావతి రాజధాని విషయంలో టీడీపీ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని అనుమానిస్తోంది. విచారణల మీద విచారణలు చేయిస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ ప్రయత్నంలోనే ఉంది. ఏ చిన్న అవకాశాన్ని జార విడుచుకోవడం లేదు. అయితే ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ అసైన్డ్ భూముల వ్యవహారాన్ని పట్టుకొని ఒక కేసు నమోదుచేయగలిగింది. అందులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణలను నిందితులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ హైకోర్టులో కొనసాగుతోంది. తాజాగా కేసు విచారణలో కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది.

వైసీపీ గద్దెనెక్కాక మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అప్పటి నుంచి అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూ వస్తున్నారు. అసలు అమరావతి రాజధానికి పనికి రాదంటూ వైసీపీ నేతలు వాదించారు. శ్మశానంతో పోల్చిన సందర్భాలున్నాయి. అమరావతి వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని.. అది కమ్మ ప్రాంతమంటూ.. ఇలా లేనిపోని మాటలు, కామెంట్స్ చేస్తూ వచ్చారు. అమరావతి రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు ఆ ప్రాంతంలో భూములు పోగుచేశారని ఆరోపించారు. ఎస్టీ, ఎస్టీల అసైన్డ్ ల్యాండ్స్ బలవంతంగా, ప్రలోభపెట్టి కొంతమంది నాయకులు రాయించుకున్నారని కూడా విమర్శించారు. సరిగ్గా అవే అభియోగాలను మోపుతూ చంద్రబాబు, నారాయణలపై కేసు పెట్టారు. గత కొద్దిరోజులుగా విచారణ కొనసాగుతోంది. అయితే కేసుకు సంబంధించి విచారణ చేపడుతున్న న్యాయమూర్తి మంగళవారం అనూహ్య ప్రకటన చేశారు. కేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఇది మిస్టరీగా మారింది.

కానీ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ శ్రీనివాసరెడ్డి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా (పీపీ) గా పనిచేశారు. కేసు విచారణలో దర్యాప్తు అధికారులు తనను సంప్రదించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారాయణపై దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టి తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని భావిస్తున్నట్టు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో మరో జడ్జి కేసును విచారించనున్నారు.