Undavalli Arun Kumar- Pawan Kalyan: ఏపీలో ఇప్పుడు విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అటు వైసీపీపై టీడీపీ, జనసేన పోరాడుతున్నాయి. బీజేపీ స్టాండ్ ఏమిటన్నది తెలియడం లేదు. ఒక రాజకీయ పక్షంగా వైసీపీని బీజేపీ వ్యతిరేకిస్తున్నా…కేంద్ర పెద్దలతో జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు కంటే పవన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలే ప్రజల్లోకి బాగా వెళుతున్నాయి. దీనిని రాజకీయ విశ్లేషకులు సైతం నమ్ముతున్నారు. ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. సామకాలిన రాజకీయ అంశాలపై మాట్లాడి స్ట్రాటజిస్టుగా పేరు దక్కించుకున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆది నుంచి ఆయన పవన్ నాయకత్వాన్ని అభినందిస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పటం గ్రామంలో విధ్వంసాలపై పవన్ స్పందించిన తీరును అభినందించారు. ఇప్పటం గ్రామానికి గుర్తింపు తెచ్చింది పవన్ కళ్యాణేనని చెప్పుకొచ్చారు.

జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలే అజెండాగా పవన్ పోరాడుతున్న తీరును ఎప్పటికప్పుడు ఉండవల్లి అభినందించారు. ఈ క్రమంలో పవన్ తో జరిగిన ఒక ఇష్యూ గురించి ప్రస్తావించారు. పవన్ పై తానేదో కామెంట్స్ చేశానని.. వాటిని పవన్ ఆశీర్వాదంగా తీసుకున్నట్టు వార్తలొచ్చాయని.. కానీ తానెప్పుడు పవన్ విషయంలో తప్పుగా మాట్లాడలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా సోషల్ మీడియా సృష్టేనని తేల్చేశారు. కాగా పవన్ రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అని.. ఇప్పటివరకూ పవర్ పాలిట్రిక్స్ చేయలేదని.. ఆయనపై తానెందుకు ఆరోపణలు, కామెంట్స్ చేస్తానని ఇటీవల పత్రికా ప్రతినిధులకు తిరిగి ప్రశ్నించారు. పవన్ తప్పకుండా సక్సెస్ అవుతారని కూడా ఉండవల్లి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఉండవల్లి ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి పోటీచేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ తో సుదీర్ఘ కాలం ఉన్న ప్రయాణాన్ని వదులుకున్నారు. అటు తన రాజకీయ సన్నిహితుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ పార్టీలోనూ చేరలేదు. అటు టీడీపీ వైపు వెళ్లే ప్రయత్నం చేయలేదు.. చేయలేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. విభజన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేస్తోందని బీజేపీ పై ఆయన విమర్శలు చేస్తూ వచ్చారు. సో బీజేపీలో చేరే అవకాశమూ లేదు. ఆయన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం జనసేన మాత్రమే. అందుకే ఆయన జనసేనను కానీ.. పవన్ ను కానీ ఎక్కడా విమర్శించిన దాఖలాలు లేవు. తప్పకుండా ఆయన జనసేన గూటికి చేరుతారని చాలా మంది విశ్లేషిస్తున్నారు. అందుకు దగ్గరగానే ఆయన వ్యాఖ్యలు చేస్తుండడం విశేషం.