Homeజాతీయ వార్తలుMunugode By Election- TRS: ఎందుకిలా జరిగిందబ్బా.. ఆధిక్యంపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం..!

Munugode By Election- TRS: ఎందుకిలా జరిగిందబ్బా.. ఆధిక్యంపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం..!

Munugode By Election- TRS: ‘‘తెలంగాణ దేశానికి అన్నం పెడుతుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని రైతుబంధు, దళితబంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నాం.. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత ఎక్కువ పింఛన్‌ తెలంగాణలోనే ఇస్తున్నాం.. వృద్ధులు, వితంతువులకే కాకుండా ఎన్నో వర్గాలు పింఛన్‌ తీసుకుంటున్నాయి. మిష¯Œ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నాం.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం.. ఇలా ఒకటా రెండా.. ఇంటింటా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే. ఒక్క మునుగోడు ఓటర్లలోనే రెండు లక్షల మందికిపైగా ఉన్నారు.. ఇంకా చెప్పాలంటే, ఓటర్లలో 99.5 శాతం మంది లబ్ధిదారులే.. వడ్డు కొనమంటే.. నూకలు తినమని మనల్ని అవమానించారు.. 18 వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడు పోయాడన్న విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లా.. అధికార బలాన్ని ఉపయోగించాం.. అంగబలం ప్రదర్శించాం.. పార్టీ మొత్తాన్ని మునుగోడులోనే మోహరించాం.. అయినా, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమిటి!? టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి కనీసం లక్ష ఓట్లు కూడా రాకపోవడం ఏమిటి?.. 40 వేలకుపైగా ఆధిక్యత వస్తుందని అంచనా వేసుకుంటే గెలవడమే పదివేలు అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది’’ ప్రస్తుతం ఇవీ అధికార టీఆర్‌ఎస్‌ నేతలను తొలుస్తున్న ప్రశ్నలు.

Munugode By Election- TRS
Munugode By Election- TRS

బీఆర్‌ఎస్‌కు బలమనుకుంటే.. ఇలా అయిందేంటి?
తెలంగాణ మోడల్‌ను చూపి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూపించి ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయాలనుకున్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా బలపడడానికి తెలంగాణ పథకాలు కీలకమవుతాయనుకుంటున్న కేసీఆర్‌.. మునుగోడు ఫలితం తర్వాత పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నవారే పార్టీకి ఓట్లు వేయని పరిస్థితి మునుగోడు ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. స్థానికంగానే సానుకూలత లేకపోవడం ఏమిటనే చర్చ ఇప్పుడు పార్టీలో జరుగుతోంది.

కళ్లముందు కదలాడుతున్న భవిష్యత్‌..
చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్లుగా ఉంది టీఆర్‌ఎస్‌ పరిస్థితి. ఒక్క ఉప ఎన్నికలో గెలుపు కోసం వంద మంది ప్రజా ప్రతినిధులను నెల రోజులు మునుగోడులోనే మోహరించినా.. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా నభూతో.. అన్నట్లు ఖర్చు చేసినా ఆశించిన ఆధిక్యం ఎందుకు రాలేదనే అంశం ఇప్పుడు పార్టీ అధినాయకత్వంలో తీవ్ర చర్చనీయాంశమైంది. సర్వ శక్తులూ, సామ దాన భేద దండోపాయాలు, ఆర్థిక, అంగ బలాలను పూర్తి స్థాయిలో ప్రయోగించినా అత్తెసరు మెజారిటీ రావడమంటే అప్రమత్తం కావాలన్న హెచ్చరిక సంకేతం రావడమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. భవిష్యత్‌ చిత్రం అగ్రనేతల కళ్లముందు కదలాడుతోంది.

లోపం ఎక్కడుంది..?
ఒక్క నియోజకవర్గం ఉప ఎన్నిక కాబట్టి ప్రత్యేకంగా దృష్టి సారించామని, రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితి ఉండదని, అప్పటికి సానుకూలతను పెంచుకోవడం ఎలా!? అని పార్టీ అధినాయకత్వం మధన పడుతోంది. పార్టీలోనా.. ప్రభుత్వంలోనా.. లోపం ఎక్కడుందనే అంశంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుత పరిస్థితికి కారణాలు, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏం చేయాలన్న అంశంపై కొందరు తటస్థులు, కొన్ని సంస్థల ప్రతినిధులతో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.

కొంతే సానుకూలత!?
మునుగోడు విజయం కోసం టీఆర్‌ఎస్‌ చేయని పని లేదు.. వేయని ఎత్తుగడ లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు మునుగోడులో అప్పటికప్పుడు గొర్రెలు, మేకల యూనిట్‌ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1.33 లక్షల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు పెండింగ్‌ బకాయిలన్నిటినీ పోలింగ్‌ ముందు చెల్లించేసింది. భూ నిర్వాసితులకు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇచ్చేసింది. వీటన్నిటికీ అదనంగా మద్యం ఏరులై పారించింది. ఓటుకు వేల రూపాయలను కుమ్మరించింది. అయినా, ఆశించిన ఆధిక్యమూ రాలేదు. మొత్తం ఓట్లు కూడా లక్ష దాటలేదు. అదే సమయంలో, ప్రత్యర్థి పార్టీలు మాత్రం సరిగ్గా డబ్బులు పంచకపోయినా, అసలు పంచకపోయినా ఓట్లను సంపాదించుకోగలిగాయి. ఈ నేపథ్యంలోనే, ఇన్ని చేసినా సానుకూలత ఎందుకు లేదు!? ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు!? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

మారుతున్న పరిస్థితులు..
ఉద్యమ సమయం నుంచీ ఉప ఎన్నిక అంటే టీఆర్‌ఎస్‌కు కొట్టిన పిండే. రాజీనామా చేయడం.. ఉప ఎన్నికకు వెళ్లడం.. అధికార పార్టీపైనా ఆధిక్యత సాధించడం గతంలో ఎన్నోసార్లు జరిగింది. ఇక, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నిక అయినా నల్లేరుపై బండి నడకేనన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది. సర్పంచి నుంచి ఎంపీ వరకూ ఏ ఎన్నిక అయినా విజయ బావుటా తమదేనన్న భరోసా శ్రేణుల్లో ఏర్పడింది. కానీ, రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. అధికారంలో ఉన్నా.. ఉప ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సిటింగ్‌ సీట్లనూ కోల్పోవాల్సి వస్తోంది. తమకు ఎదురే లేదని, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదనే పరిస్థితి నుంచి కిం కర్తవ్యం? అంటూ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడో సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొడతామనే భరోసా బదులు మునుగోడులో గెలిచి కూడా ముప్పతిప్పలకు కారణం ఏమిటనే అంతర్మథనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

యువత ఎందుకు దూరమయ్యారు!?
పార్టీ ఆవిర్భావం నుంచీ టీఆర్‌ఎస్‌ వెన్నంటి ఉన్నది యువతే. ఇంకా చెప్పాలంటే, ఉద్యమ సమయంలో ఆ పార్టీకి వెన్నెముకగా నిలిచారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తమకు నియామకాలు వస్తాయనే ఆశతో యువతే పార్టీ క్యాడర్‌గా మారి పని చేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే విషయం క్రమక్రమంగా గులాబీ నేతలకు అర్థమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికతో ఈ విషయం మరింత సుస్పష్టమైంది. నిన్న మొన్నటి వరకూ అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదనే ఆగ్రహం యువతలో ఉండేది. ఇప్పుడు వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న నేపథ్యంలో యువత తమకే మద్దతు తెలుపుతారనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌ నేతల్లో ఉంది. కానీ, మునుగోడులో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. దాంతో, నోటిఫికేషన్లు ఇస్తున్నా నారాజ్‌ ఎందుకనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోంది. ఇక, బీసీల్లో కొన్ని సామాజికవర్గాలు కూడా కొంత దూరమైన విషయం ఆ పార్టీ దృష్టికి వచ్చింది. ఆ వర్గాలను కూడా తిరిగి దరి చేర్చుకునే దిశగా వ్యూహం అమలు చేయాలనే ఉద్దేశంతో ఉంది. అలాగే, ప్రజలతో సన్నిహితంగా ఉండడం, వారితో మమేకం కావడాన్ని మరింత విస్తృతం చేయాలన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వ్యక్తిగత లబ్ధి, వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత సంక్షేమంతోపాటు ఓటర్లతో వ్యక్తిగత సంబంధం నెరపడంపైనా ఇకపై దృష్టి పెట్టాలనే దిశగా ఆ పార్టీలో సమాలోచనలు సాగుతున్నాయి.

Munugode By Election- TRS
KCR

బలుపు మాటలు.. బలవంతపు చర్యలు..
ఉద్యమ పార్టీగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఇప్పటికీ గుర్తింపు ఉంది. కానీ అధికారంలోకి వచ్చాక.. నేతల వ్యవహారం.. బలుపు మాటలు.. అధికారం ఉందన్న అహకారంతో తీసుకుంటున్న నిర్ణయాలు. తాము ఏం చేసినా చెల్లుతుందనే భావన అగ్రనేతల్లో కనిపించడం ప్రజలకు, ముఖ్యంగా యువతకు నచ్చడం లేదు. మరోవైపు కిందిస్థాయి క్యాడర్‌ ఏం చేసినా ఎమ్మెల్యేలు ‘మా వాడే వదిలేయ్‌’ అంటూ పోలీసులకు హుకూం జారీ చేయడంతో టీఆర్‌ఎస్‌ నేతల బాధితులు రాష్ట్రంలో పెరుగుతున్నారు. ఇక పోలీసులు, ఉద్యోగ సంఘాలను అయితే.. కుక్కకు బొక్కేసినట్లు.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం చూస్తోంది. ఇది పైస్థాయి అధికారులకు, నేతలకు నచ్చుతోంది. కిందిస్థాయిలో ఇంతలా దిగజారడంపై వ్యతిరేకత పెరుగుతోంది. సామాన్యుడికి న్యాయం చేసే.. న్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతోంది. అందుకే ఎన్ని పథకాలు ఇచ్చినా.. ఎన్ని డబ్బులు పంచినా.. ‘వాడు ఇంట్ల కెళ్లి ఇస్తుండా.. మన సైసలే తీసుకుని మనకే పంచుతుండు’ అన్న భావన ప్రజల్లో క్రమంగా పెరుగుతోంది. టీఆర్‌ఎస్‌కు బలమనుకున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు విషయంలో ఈ అభిప్రాయం లబ్ధిదారుల్లో స్పష్టంగా వ్యక్తమవుతోంది. రైతుబంధు ఇచ్చి.. సబ్సిడీ పతకాలన్నీ ఎత్తివేసి తీరు ఇప్పుడిప్పుడే రైతులకు అర్థమవుతోంది. రైతుబంధు జమ చేసిన వారం రోజుల్లోనే ఆ డబ్బులన్నీ మద్యం షాపులకు వెళ్లి.. తిరిగి ప్రభుత్వ ఖజానాకే జమవుతున్నాయి. సబ్సిడీపై విత్తనాలు, యంత్రాలు ఇచ్చి ఉంటే.. అవి రెండు మూడు దశాబ్దాలు రైతులకు ఉపయోగపడేవి. రైతుబంధు ఇస్తున్నా.. రైతులు మళ్లీ అప్పుకోసం బ్యాంకుల చుట్టూ.. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం మాత్రం మానలేదు. ఈ పరిస్థితి టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి అర్థమైన నాడే.. రైతులు, పథకాల లబ్ధిదారులు, అధికారం ఉన్నేడికే కాకుండా.. అందరికీ సమ న్యాయం జరుగుతుందన్న భావన ప్రజల్లో వస్తే తప్ప రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పరిస్థితి మారదన్న అభిప్రాయం గులాబీ పార్టీని దగ్గర నుంచి పరిశీలస్తున్నవారిలో వ్యక్తమవుతోంది. లేకుంటే.. జాతీయ రాజకీయాలు దేవుడెరుగు.. సొంత రాష్ట్రంలోనూ అధికారం కోల్పోక తప్పదని పేర్కొంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version