https://oktelugu.com/

UN SDG Summit: కూలీ బిడ్డలే.. ఐక్యరాజ్యసమితిలో వెలిగారు.. ఏపీ ఘనత ఇదీ

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి రాజకీయ సదస్సును న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 20, 2023 4:46 pm
    UN SDG Summit

    UN SDG Summit

    Follow us on

    UN SDG Summit: వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారే. అయితేనేం అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ నైపుణ్యమే వారిని అంతర్జాతీయ వేదికల వైపు అడుగులు వేయించగలిగింది. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే అందుకు దిక్సూచిగా ఏపీ ప్రభుత్వం నిలవడం అభినందనీయం. ఏపీకి చెందిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐక్యరాజ్యసమితి తో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై కీలక ప్రసంగాలు ఇవ్వడం ఏపీ ప్రభుత్వానికి గర్వకారణం.

    ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి రాజకీయ సదస్సును న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం తరఫున సైతం కొంతమంది ప్రతినిధులు హాజరై స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదిమంది విద్యార్థులను అమెరికాకు తీసుకెళ్లారు. వీరంతా అక్కడ వేదికల మీద ప్రముఖుల సమక్షంలో చేసిన ప్రసంగాలు, తమ రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న కృషిని వివరించారు. దీనికి ప్రపంచ మేధావులు ముగ్ధులయ్యారు. కెనడా స్కూళ్లు, కాలేజీల సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు అధికారి జూడీ ప్రశంసలు కురిపించారు. కాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షరీల్ అభినందించారు. కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ జఫ్ఫ్రీ సాచ్ అయితే ఏపీ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

    అయితే ఈ పదిమంది విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో నైపుణ్యం కనబరిచిన వారిని ఎంపిక చేశారు. అమెరికాకు తీసుకెళ్లారు. అయితే అధికారుల అంచనాకు తప్పకుండా పేద విద్యార్థులు నైపుణ్యం కనబరిచారు. ప్రధానంగా సమాజం మనుగడకు యువశక్తి కీలకమంటూ విద్యార్థులు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పై జరిగిన సదస్సులో సైతం విద్యార్థులు మాట్లాడారు. సాధారణ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఇంతటి పరిణితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పదిమంది విద్యార్థులు చూపిన పరిణితితో జగన్ సర్కార్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు అంతర్జాతీయంగా గుర్తింపునకు నోచుకుంటున్నాయి.