
ఎన్నో గొడవలు.. ప్రతిపక్షాల ఆందోళనలు.. కోర్టు కేసులు.. ఇంకెన్నో సందేహాలు.. అన్నింటినీ దాటుకుంటూ.. చీల్చుకుంటూ తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అయిన విషయం తెలిసిందే. పాత సచివాలయం కూల్చివేత ఎంత టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిందో!. ప్రతిపక్షాల ఆందోళనలు.. కోర్టు స్టేలు..అనుమతుల మధ్య ఎట్టకేలకు రాత్రి వేళ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక సెక్రటేరియేట్ను కూల్చి వేసింది. అటు వైపు ఎవరూ రాకుండా.. ఏ ప్రమాదం జరుగకుండా ట్రాఫిక్ ను వేరే రూట్ లో పంపించి పది, పదహేను రోజులు కూల్చివేతలను కొనసాగించారు. వందలాది పోలీసులను సెక్యూరిటీగా పెట్టి మరీ భారీ కట్టడాన్ని నేలమట్టం చేశారు.
Also Read: సీఎం కేసీఆర్ అలా నోరు తెరిచి సాయం ఎందుకు కోరినట్లు..?
పాత సచివాలయం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదని భావించిన సీఎం కేసీఆర్ తన కలల సౌధం… మోడ్రన్ సెక్రటేరియేట్ నిర్మించాలని సంకల్పించారు. ఒకే ప్రాంతంలో సీఎం, మంత్రులు, అన్ని శాఖల ఆఫీసులు ఉండాలని.. సెమినర్ హాల్స్ ఉండాలని.. తెలంగాణ వైభవం ఉట్టిపడేలా డిజైన్ చేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. ఈక్రమంలో మూడు సీఎం చెంతకు మూడు డిజైన్ లు రాగా.. వాటిలో ఒక దానిని సీఎం ఫైనల్ చేశారు. దీన్ని 400కోట్లతో ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. దసరాకు నిర్మాణ పనులు ప్రారంభించేలా ఆఫీసర్లు రంగం సిద్ధం చేసి ఇటీవల టెండర్లను సైతం పిలిచారు.
అయితే టెండర్లు వేసేందుకు రెండంటే రెండు కంపెనీలే ముందుకొచ్చాయి. అవి కూడా దేశంలోనే ప్రతిష్ఠాత్మక భారీ కంపెనీలైన షాపూర్జీ పల్లోంజీ, ఎల్ ఆండ్ టీ లు టెండర్ బిడ్లు దాఖలు చేశాయి. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి ఆర్ అండ్ బీ ఆన్ లైన్ లో టెండర్లు ఆహ్వానించగా గడువు నిన్నటి తో ముగిసింది. ప్రీ బిడ్ మీటింగ్ కు ఆరు కంపెనీల ప్రతినిధులు హాజరైనప్పటికీ.. కేవలం 12 నెలల్లోనే పూర్తి చేయడం, సబ్ కాంట్రాక్టర్లకు ఆస్కారం లేకపోవడం, మొబిలైజేషన్ అడ్వాన్సులు లేకపోవడం వల్ల మిగతా సంస్థలు ఆసక్తి చూపలేదని సమాచారం. ప్రీ బిడ్ మీటింగ్స్ సందర్భంగా కొన్ని కంపెనీల ప్రతినిధులు ఈ అంశాలను ప్రస్తావించారు. టెండర్ దాఖలు ముగియడంతో సాంకేతిక బిడ్లను తెరిచారు. ఈనెల 23న ఆర్థిక బిడ్లను పరిశీలించి కాంట్రాక్టర్ ను ఎంపిక చేస్తారు.
Also Read: కంగనాకు వార్నింగ్.. ‘నడిరోడ్డుపై రేప్ చేస్తా’..!
కొత్త సెక్రటేరియేట్ నిర్మాణ పనులను దసరా నాడు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంవత్సరం లోపు పనులు పూర్తి చేసి వచ్చే సంవత్సరం దసరా నాటికి కొత్త బిల్డింగ్ ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే టెండర్ల కసరత్తులో జాప్యం జరుగడంతో దసరాకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనబడడం లేదు. మరో వైపు వర్షాల కారణంగా పనులు మరింత ఆలస్యం కానున్నాయి. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో ఎక్కడ తవ్వినా పెద్ద మొత్తంలో నీరు ఊరే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు.