Pawan Kalyan Ring: ఏపీకి కాబోయే కొత్త ముఖ్యమంత్రి పవన్.. ఇప్పుడిదే సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అధికార వైసీపీ కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని, మాజీ సీఎం చంద్రబాబును పక్కన పెట్టి పవన్ ను టార్గెట్ చేయడంపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. పవన్ నే అసలు ప్రత్యర్థిగా పరిగణిస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటివరకూ ఒక్కచోట కూడా గెలవలేదని.. చంద్రబాబు దత్తపుత్రుడు, బీజేపీ ప్యాకేజీ తీసుకున్నాడంటూ వాదించిన వైసీపీ సడన్ గా రూటు మార్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే పవన్ రాజకీయంగా దూసుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వనని కూడా శపథం చేశారు. అవసరమైతే భావసారుప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని, ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని కూడా స్పష్టం చేశారు. అప్పటి నుంచి అధికార పార్టీ నేతలకు కంటమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

ప్రస్తుతానికైతే పవన్ పక్కా రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. జనసేనకు బలమున్న నియోజకవర్గాలపైనే కాన్సంట్రేట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన లేని ప్రభుత్వం ఏర్పాటుచేయడం అసాధ్యం చేసేలా పావులు కదుపుతున్నారు. జనసేన ఎన్ని స్థానాల నుంచి పోటీచేస్తుంది? పవన్ ఎక్కడ బరిలో దిగుతారు? గతం మాదిరిగా రెండు నియోజకవర్గాల నుంచా? లేకుండే ఒకే ఒక స్థానాన్ని ఎంచుకుంటారా? అన్న దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే మాత్రం లోలోప అంతా కసరత్తు జరుగుతోందని జన సైనికులు చెబుతున్నారు. అంది వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టకూడదని పవన్ డిసైడైనట్టు తెలుస్తోంది.

మరోవైపు పవన్ చేతికి కొత్తగా రెండు ఉంగరాలు దర్శనమిస్తున్నాయి. అందులో ఒకటి పగడంతో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యేక యాగాలు, పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ చేతికి ఉంగరాలంటూ ఒక కొత్త చర్చ ప్రారంభమైంది. ఆ మధ్యన పవన్ సన్నిహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉపనయనం చేయించుకున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ జనసేన గెలుపునకే అంటూ కామెంట్లు వినిపించాయి. తాజాగా పవన్ చేతిలో ఉన్న పగడపు ఉంగరం అంత ఖరీదుదు కాకపోయినా.. తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా ముగియడానికి అటువంటివి ధరిస్తుంటారు. మరోవైపు పవన్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే అటు పొలిటికల్ మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ చేతికి ఉంగరాలు వచ్చి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. అటు పొలిటికల్, ఇటు సినిమారంగంలో పవన్ సక్సెస్ కోసం ఉంగరాలు ధరించడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.