
Hyderabad High Level Bridges : విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ సిగలో మరో రెండు మణిహారాలు చేరబోతున్నాయి. హైదరాబాద్ లో రెండు హైలెవల్ బ్రిడ్జిల కోసం జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.52 కోట్లతో మూసారంబాగ్ వద్ద గ్రౌండ్ లెవల్ నుంచి 15 మీటర్ల ఎత్తు, 29.5 మీటర్ల వెడల్పుతో 220 మీటర్ల పొడవులో బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రూ.42 కోట్లతో చాదర్ ఘాట్ వద్ద ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి 9 మీటర్ల ఎత్తులో 4 లేన్లతో 21 మీటర్ల వెడల్పు, 220 మీటర్ల పొడవుతో పాటు ఫుట్ పాత్ ను నిర్మించనుంది. ఈ రెండు పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ సమాయత్తమైంది.
దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. భాగ్యనగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకనుగుణంగా రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం చేయాలని సర్కారు సంకల్పించింది. వరదల ముప్పు నుంచి నగరాన్ని కాపాడేందుకు రెడీ చేస్తోంది. ఇందులో భాగంగానే రెండు బ్రిడ్జీలు నిర్మిస్తోంది. నిధుల సమస్యతో మిగతా నిర్మాణాలు ప్రారంభం కాకున్నా వీటితో నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని జీహెచ్ఎంసీ కార్యాచరణ రూపొందించింది.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ కి నిధుల సమస్య వెంటాడుతోంది. ఈ ఏడాది జనవరి 29న రూ. 545 కోట్లతో 15 బ్రిడ్జిలు నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నిధుల సమస్యతో ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.. అంత డబ్బు లేకపోవడంతో బ్రిడ్జిల నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. రుణంగా తీసుకుందామనుకున్నా ఇప్పటికే పెరిగిన అప్పులతో ఇవ్వని పరిస్థితి. ఇక హైదరాబాద్ రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో నిధులు లేకపోవడంతో బ్రిడ్జిల నిర్మాణం ముందుకు సాగడం లేదు. వరదలు వస్తే నగరం మొత్తం నీటిలో మునిగిపోతుండటంతో బ్రిడ్జిల నిర్మాణం అనివార్యంగా మారింది..
2020, 2022 సంవత్సరాల్లో కురిసిన భారీ వర్షాలతో నగరం మొత్తం నీట మునిగింది. ఈ సమస్య రాకుండా చేయాలంటే బ్రిడ్జిల నిర్మాణం అత్యవసరం. ఈ నేపథ్యంలో రూ.40 కోట్లతో అఫ్జల్ గంజ్ వద్ద ఐకానిక్ పాదచారుల వంతెన నిర్మించాలని భావించింది. రూ.52 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి, రూ.39 కోట్లతో ఇబ్రహీం బాగ్ కాజ్ ను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి, రూ. 32 కోట్లతో సన్ సిటీ, చింతల్ మెట్ ను కలుపుతూ మూసీపై హైలెవల్ బ్రిడ్జి , రూ.32 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు.
కిస్మత్ పూర్ ను కలుపుతూ మూసీ నదిపై బండ్లగూడ జాగీర్ వద్ద హైలెవల్ బ్రిడ్జి, రూ. 52 కోట్లతో మూసారాంబాగ్ వద్ద హైలెవల్ బ్రిడ్జి, రూ. 42 కోట్లతో చాదర్ ఘాట్ వద్ద మూసీపై హైలెవల్ బ్రిడ్జి, రూ. 35 కోట్లతో అత్తాపూర్ లో మూసీపై ఉన్న బ్రిడ్జీలకు సమాంతరంగా రెండు బ్రిడ్జీలు, రూ.42 కోట్లతో ఉప్పల్ లే అవుట్ ను కలుపుతూ మూసీపై బ్రిడ్జి, రూ. 39 కోట్లతో మంచిరేవుల గ్రామం-నార్సింగ్ లను కలుపుతూ మూసీపై హైలెవల్ బ్రిడ్జి, రూ. 32 కోట్లతో బుద్వేల్ వద్ద మూసీపై ఐటీ పార్కులు, సమాంతర రోడ్లను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని చూస్తోంది.
రూ. 42 కోట్లతో హైదర్ షా కోట్, రాందేవ్ గూడలను కలుపుతూ మూసీపై బ్రిడ్జి, రూ. 20 కోట్లతో బుద్వేల్ వద్ద రెండో బ్రిడ్జి, రూ. 35 కోట్లతో ప్రతాపసింగారం, గౌరెల్లిని కలుపుతూ మూసీపై హైలెవల్ బ్రిడ్జి, రూ. 11 కోట్లతో మంచిరేవుల బ్రిడ్జిని కలుపుతూ లింక్ రోడ్డు నిర్మాణం చేయాలని నిర్ణయించింది. మూసీ నదిపై నిర్మించనున్న 15 బ్రిడ్జీల కోసం ప్రభుత్వం రూ. 545 కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పుడు నిధుల లేమితో వెలవెలబోతోంది. బ్రిడ్జీల నిర్మాణం అటకెక్కింది. నిధులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ప్రస్తుతానికి అయితే ముసారంబాగా్, చాదర్ ఘాట్ బ్రిడ్జీల పనులను పూర్తి చేయాలని సంకల్పించింది.