జో బైడెన్.. అమెరికా అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పుడు బైడెన్‌పైనే యావత్ ప్రపంచ దేశాల దృష్టి ఉంది. అసలే అగ్రరాజ్యం.. ఆపై కొత్త అధినేత.. ఆయన తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలు, వైఖరీలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. అయితే.. జో బైడెన్ ఎంపిక చేసుకున్న టీమ్ ను బట్టి చూసి ఆయా దేశాలు మాత్రం ఓ అంచనాకు వచ్చాయి. ముఖ్యంగా భారత సంతతికి చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.
Also Read: బీహార్ సంకీర్ణంలో అప్పుడే లుకలుకలు..!
భారత మూలాలున్న కమలా హారిస్ ఏకంగా ఉపాధ్యక్షురాలయ్యారు. భారత్ అంటే సానుకూలంగా ఉండే నాయకులు రక్షణ, విదేశాంగమంత్రులుగా నియమితులయ్యారు. అదే సమయంలో కాశ్మీరీ మూలాలు గల ఇద్దరు మహిళలు బైడెన్ టీమ్ లో సభ్యులుగా నియమితులయ్యారు. సమీరా ఫాజిలిని జాతీయ ఆర్థిక మండలి (ఎన్ఈసీ) డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మరో మహిళ ఈషా షా శ్వేత సౌథంలోని డిజిటల్ స్ట్రాటజీ టీమ్ భాగస్వామ్య నిర్వాహకురాలిగా నియమితులయ్యారు. వీరిద్దరూ కాశ్మీరీ మూలాలు గల మహిళలు. ఈషా లూసియానాలో పుట్టి పెరిగారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు సన్నిహితురాలు. దీంతో వీరి నియామకం భారత్- అమెరికా బంధంపై ఎంతవరకు, ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ జరుగుతోంది.
ఎక్కడైనా సలహాదారులకు అధినేతలను ప్రభావితం చేసే శక్తి ఉండదు. కానీ.. వారి మాటలను మాత్రం శ్రద్ధగా వింటారు. ఒక నిర్ణయానికి రానప్పటికీ, వారి నిర్ణయాలను మాత్రం విభేదించరు. ఎందుకంటే.. అమెరికాలోని డెమొక్రట్లు మానవహక్కులకు ప్రాధాన్యమిస్తారు. ప్రజాస్వామంటూ ప్రకటనలు చేస్తుంటారు. 2019 ఆగస్టు 5న జమ్ము కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణ రద్దు చేసే సమయంలో కొంత మంది డెమొక్రటిక్ పార్టీ నాయకులు వ్యతిరేక ప్రకటనలు చేశారు. కాశ్మీర్ లోయలో మానవహక్కులకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. భారతీయ మూలాలున్న కమలా హారిస్ కూడా గతంలో కాశ్మీర్ పై భారత ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడారు. మొత్తానికి కాశ్మీర్ పై డెమొక్రట్ల భావనలు, అభిప్రాయాలు న్యూఢిల్లీ మనోభావాలకు భిన్నంగా ఉండేవి. దీనికితోడు నాటి అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్రమోదీల మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం ఉండేది. ట్రంప్ గెలుపు కోసం మోదీ అమెరికాలో హౌడీ-మోడీ కార్యక్రమం నిర్వహించారన్న పేరుంది.
Also Read: పాన్ కార్డ్ లేనివారికి శుభవార్త.. పదినిమిషాల్లో పాన్ కార్డు పొందే ఛాన్స్..?
అమెరికాలో ప్రవాస భారతీయుల మద్దతు ట్రంప్‌నకు లభించేందుకు 2018లో అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించారనేది వాదన. అందుకే.. భారతీయ నాయకత్వం కూడా ఈ ఎన్నికల్లో ట్రంప్ వైపే నిలిచిందన్న అభిప్రాయం ఉంది. ఈ విషయాలు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలుకు తెలియవని అనుకోలేం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కాశ్మీరీ మూలాలు గల ఇద్దరు మహిళలకు బైడెన్ టీమ్ లో చోటు లభించిందన్న ప్రచారం దౌత్యవర్గాల్లో జరుగుతోంది. కానీ కేవలం కాశ్మీర్ కోసం భారత్ ను దూరం పెట్టే పరిస్థితిలో వాషింగ్టన్ లేదన్న వాదనా వినిపిస్తోంది. చైనాను ఎదుర్కోవడం కోసం భారత్ కు మద్దతు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి అమెరికాకు ఉంది. చాలా విషయాల్లో ఉభయ దేశాల మధ్య సాన్నిహిత్యం ఉంది. కేవలం ఈ ఒక్క కారణంతో భారత్‌ను దూరం చేసుకుంటుందని ఎవరూ అనుకోరు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు