Jagan Gruha Saradhulu: వైసీపీలో కింది స్థాయి నేత నుంచి మంత్రుల వరకూ ఎవరూ ప్రశాంతంగా ఉండడం లేదు. నేను బటన్ నొక్కుతున్నాను.. మీరు ప్రజల వద్దకు వెళ్లి మార్కులు సంపాదించండని జగన్ టాస్కుల మీద టాస్కులు పెడుతున్నారు. వైసీపీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఐ ప్యాక్ టీమ్ చేతిలోకి వెళ్లిపోయింది. వారు ఏది చెబితే అది చేయాలి. వారి చెప్పిన సూచన పాటించాలి. చివరకు వారు ఎమ్మెల్యేలకు బ్లాక్ మెయిలింగ్ చేసే తరహాలోకి చేరుకున్నారు. చెప్పింది వినకుంటే మీ పనితీరుపై తప్పుడు నివేదిక ఇస్తామన్న స్థితికి వారు చేరుకున్నారు. నీయమ్మా జీవితం ప్రతిఒక్కరూ బెదిరించే వారే అంటూ నిట్టూరుస్తూ వారు గడపగడపకూ వెళ్లాల్సి వస్తోంది. కానీ ప్రజల నుంచి ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. వారిని తట్టుకోవడానికి చివరకు ప్రజలకే ఎదురుకానుకలు ఇచ్చి నోరుమూయాల్సి వస్తోంది. మరోవైపు వలంటీరు వ్యవస్థతో అసలు రాజకీయమే ఉనికి కోల్పోయింది. ఇటువంటి తరుణంలో గృహసారథుల నియామకానికి జగన్ నిర్ణయించారు. ఎన్నికల టీమ్ గా భావించి వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారు. వారి నియామక బాధ్యతలు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలకు అప్పగించారు.

మరోవైపు మూడు నెలలే ఉంది. ప్రజల్లోకి వెళ్లి తమ పనితీరు మెరుగుపరచుకోకుంటే తప్పిస్తానని అధినేత హెచ్చరించారు. అంతకంటే ముందుగా గృహ సారథులను నియమించాలి. దీంతో గ్రామాలకు వెళ్లి గృహ సారథుల ఎంపిక పనిలో పడాలి. వైసీపీ అధికారంలోకి వస్తే కుమ్మేద్దామన్న నాయకులు చాలామంది నిరాశతో ఉన్నారు. అటువంటి నేతలను గృహసారథులుగా ఉండాలని ఎమ్మెల్యే చెబుతుంటే.. ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడు ఈ ప్రేమ ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. కక్కలేక మింగలేక ఎమ్మెల్యేలు తెగ బాధపడుతున్నారు. మా పరిస్థితే బాగాలేదు.. మీకేం చేయగలమని నిట్టూరుస్తున్నారు. ఎలాగోలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే కార్యకర్తల అయిష్టతను దృష్టిలో పెట్టుకొని వైసీపీ నేతలు ఒక ప్రచారానికి పదును పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఓటు పంపకాలన్నీ గృహ సారథుల చేతుల మీదుగా జరుగుతాయని.. ఓటకు 15 నుంచి 20 వేల వరకూ ముట్టజెబుతారని ప్రచారం చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు గృహసారథులుగా ఉండేందుకు ముందుకొస్తారని అంచనా వేస్తున్నారు. ఎంతో కొంత వెనుకేసుకోవచ్చన్న ఆలోచనతో ఈ ప్లాన్ వేశారు. అయితే ఇది ప్రచారం వరకే మిగిలితే మాత్రం గృహ సారథులు దెబ్బయిపోతారు. ఓటరుకు నోటు పంచే విషయంలో తమ దాకా వస్తారా? అని ప్రశ్నిస్తున్నవారున్నారు. హైకమాండ్ ఇచ్చిన ధనంలో కొసరే తమచేత పంపకాలు చేపడతారని.. మిగతా గ్రామస్థాయి నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలే చూసుకుంటారని భావిస్తున్న వారూ ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ విషయంలో వైసీపీ శ్రేణులను ఆయన తెగ టెన్షన్ పెడుతున్నారు. పథకం ఇస్తున్నది జగన్.. తీసుకుంటున్నది లబ్ధిదారు. కానీ ఈ విషయంలో మీ పాత్ర ఏమిటి? అని అటు సీఎం జగన్, ఇటు లబ్ధిదారు ప్రశ్నిస్తున్నారు. పథకం ప్రభుత్వం ఇస్తన్నదే అంటే అందరితో పాటు వస్తుందే కానీ.. అందులో ప్రత్యేకత ఏముందని లైట్ తీసుకుంటున్నారు. సీఎం జగన్ ప్రజల వద్దకు వెళ్లాలని గద్దిస్తున్నారు. తాను బటన్ నొక్కి ఇస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని చూస్తున్నారు. ఇప్పుడు గృహసారథుల నియామకం బాధ్యతలను అప్పగించి మరింత భారం పెట్టారు. రాజకీయమంటే మరీ ఇంత దిగజారిపోయాయా అంటూ చాలా మంది ఎమ్మెల్యేలు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.