Chandrababu: ఏపీలో ఎన్నికల హీట్ నెలకు ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి. రాజకీయ ప్రచార సభలను ప్రారంభించాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విపక్ష నేత చంద్రబాబు కేసుల్లో కదలిక రావడం విశేషం. అవినీతి కేసుల్లో ఆయనకు లభించిన ముందస్తు బెయిల్ పై కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. దీంతో న్యాయస్థానం నుంచి ఎటువంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుపై ఏపీ సిఐడి అవినీతి కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించింది. అయితే కింది కోర్టులు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానిపై నేడు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించింది. అయితే అక్కడితో ఆగని సిఐడి ఆయనపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కూడా నమోదు చేసింది. ఈ కేసులో సైతం ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరింది. నేడు దానిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా టిడిపి ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించింది. అయితే చాలామంది అస్మదీయులకు ప్రయోజనం కలిగించేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు అన్నది సిఐడి వాదన. కానీ అసలు రోడ్డే నిర్మించలేదని.. అందులో అవినీతి జరిగే అవకాశం ఏముంటుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. అయితే అలైన్మెంట్ మార్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించారని సిఐడి వాదిస్తోంది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు నాటి మంత్రి నారాయణ పై సైతం సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణకు మరికొంత కాలం చంద్రబాబు కస్టడీని కోరుతూ సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఏపీ హైకోర్టు తోసిపుచ్చుతూ.. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సరిగ్గా ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ ప్రాధాన్యత అంశంగా మారిపోయింది. కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందోనని ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. ఒకవేళ చంద్రబాబు ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తే.. మిగతా కేసుల్లో మంజూరైన బెయిల్ సైతం రద్దు చేయాలని సిఐడి కోరే అవకాశం ఉంది. ఒకవేళ కానీ సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తే మాత్రం.. చంద్రబాబుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టే. మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి.