TVK In Andhra Pradesh: తమిళనాడు ఎన్నికల్లో గెలుపు ఊపులో ఉన్నారు దళపతి విజయ్. అందరి అంచనాలకు భిన్నంగా రెండు ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి మరి తమిళనాడులో అధికారం పొందనున్నారు. ఈ తరుణంలో తన పార్టీని విస్తరించాలన్న ఆలోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా దక్షిణాది రాష్ట్రాలపై ఆయన ఫోకస్ పెడతారని సమాచారం. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో పాటు కొందరు సినిమా పెద్దల ద్వారా అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలోగా తెలుగు రాష్ట్రాల్లో విజయ్ పార్టీ విస్తరణ ఖాయమన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. అయితే తెలంగాణ కంటే ఏపీలోనే విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కలిసి వచ్చే వర్గాలు ఉన్నాయి. అందుకే ఏపీలో పార్టీ విస్తరణకు ఛాన్స్ ఉంటుందన్న టాక్ నడుస్తోంది.
* క్రిస్టియన్ వర్గం అధికం..
ఏపీలోని కోస్తా ప్రాంతంలో క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు ఎక్కువ. తెలంగాణతో పోల్చుకుంటే ఆ సామాజిక వర్గం ఇక్కడే ఎక్కువగా కనిపిస్తారు. ఆ వర్గాల్లో విజయ్ కు మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే విజయ్ తెలుగు సినిమా రీమేక్ లు ఎక్కువగా ఇక్కడ ఆదరణ పొందుతున్నాయి. ఏపీ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలను పరిగణలోకి తీసుకొని.. విజయ్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు ఏపీలో ఉన్న పొలిటికల్ స్పేస్ ను వివరించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ ఏపీలో పార్టీ విస్తరణ వెనుక ఓ జాతీయ పార్టీ పెద్దల ప్రోత్సాహం ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది. ప్రధానంగా క్రైస్తవ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని విజయ్ కొత్త పార్టీ విస్తరణ ఉంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
* వైసీపీకి షాక్..
ఒకవేళ విజయ్ పొలిటికల్ విస్తరణ ఏపీలో ఉంటే కచ్చితంగా అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంప్రదాయ ఓటు బ్యాంకుగా క్రిస్టియన్ వర్గం ఉంది. దానికి 2024 ఎన్నికల్లో గండి పడింది. షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా క్రిస్టియన్ వర్గం ఒకటి ఎదురు నిలిచింది. దాని ఫలితంగా ఆ వర్గంలో చీలిక వచ్చింది. 2014, 2019లో ఆదరించిన ఆ వర్గాలు 2024 ఎన్నికలకు వచ్చేసరికి వ్యతిరేకం అయ్యాయి. అయితే ఇప్పుడు దళపతి విజయ్ ఎంట్రీ కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటివరకు తమిళనాడులో విజయ్ గెలుపును వైసీపీ సంబరాలు చేసుకుంటుంది. కానీ విజయ్ ఏపీలో పార్టీ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయి.