
Akshay Kumar: అక్షయ్ కుమార్ అంటే బాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ఖాన్‌లను తట్టుకుని నిలబడ్డ హీరో. నమస్తే లండన్, రౌడీ రాథోడ్, ప్యాడ్ మన్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని బొచ్చెడు. ఏకంగా ప్రధానమంత్రినే ఇంటర్వ్యూ చేసిన ఈ హీరో ఇప్పుడు వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు వరుసగా తన్నేశాయి. ఇప్పుడు బీ-ఉడ్ నిర్మాతలు అక్షయ్ సినిమా అంటేనే భయపడుతున్నారు. హిందీ కథలతో కాకుండా దక్షిణాది కథలతో తీసిన సినామాలు కూడా బొక్కాబోర్లా పడుతున్నాయి. అప్పట్లో తమిళంలో రాఘవ లారెన్స్ తీసిన కాంచన సినిమాను లక్ష్మీబాంబ్ అని తీస్తే జనం ఛీ పో అని ఛీత్కరించుకున్నారు. పైగా ఆ సినిమా డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలయింది కాబట్టి నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే తడి గుడ్డ నెత్తిన వేసుకోవాల్సి వచ్చేది. అంతే కాదు తమిళ్‌లో సూపర్ హిట్ అయిన రాక్షసన్‌ను హిందీలో రీమేక్ చేశారు. అదృష్టవశాత్తూ దానిని కూడా డిస్నిలోనే స్ట్రీమ్ చేశారు. లేకుంటే నిర్మాతకు థియేటర్ ఖర్చులు కూడా రాకపోవును.
సూర్యవంశీ మాత్రమే
అక్షయ్‌కుమార్ లాస్ట్ హిట్ సూర్యవంశీ. ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. కట్ పుత్లీ దారుణమైన ఫలితాన్ని వచ్చింది.(అది ఓటీటీలో రిలీజ్ అయింది.) తమిళ్‌లో హిట్టయిన జిగర్తాండకు రిమేక్ గా బచ్చన్ పాండే అని తీస్తే అది ప్లాప్ అయింది. సామ్రాట్ పృథ్విరాజ్ అడ్డంగా తన్నేసింది. రక్షాబంధన్, రామ్‌సేతు, సెల్ఫీ సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. వీటిలో రామ్ సేతు యావరేజ్ అంటున్నారు కానీ, ట్రేడ్ వర్గాలు మాత్రం ఫ్లాప్ అని చెబుతున్నాయి. ఇక ఈ ఆరు ఫ్లాప్‌ల్లో సెల్ఫీ దారుణమైన డిజాస్టర్. ఫిలీం అనలిస్టుల ప్రకారం ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు జస్ట్ రూ. 1.3 కోట్లు. బహుశా ఇంతటి దారుణమైన కలెక్షన్లను అక్షయ్ కుమార్ కలలలో కూడా ఊహించిఉండడు.
ఎందుకు ఇలా
వాస్తవానికి అక్షయ్‌కుమార్ ఆరు ఫ్లాపుల్లో మూడు సినిమాలు దక్షిణాదిలో సూపర్ హిట్ అయినవే. కాంచన, రాక్షసన్, డ్రైవింగ్ లైసెన్స్.. సినిమాలను రీమేక్ చేస్తే పోపోవోయ్ అంటూ ఈడ్చి కొట్టారు. వాస్తవానికి డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను సెల్ఫీ పేరుతో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించగానే బాలీవుడ్ మీడియా ఏదో అపశకునం లాగా ఈ సినిమా అడదు అని తేల్చేసింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా దొబ్బేసింది. ఇందులో తెలుగు సీతారామంలో సీత పాత్రధారిణి మృణాల్ ఠాకూర్ ఒళ్లు దాచుకోకుండా కష్టపడినప్పటికీ ఫలితం దక్కలేదు. పైగా ఫస్ట్ డే కలెక్షన్లు కోటికి మించలేదంటే ఈ సినిమా ఎంతటి డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్‌కు గ్రహచారం
గతేడాది దృశ్యం-2 సినిమా సూపర్ హిట్‌తో బాలీవుడ్ మళ్లీ గాడిలో పడింది అని అందరూ అనుకున్నారు. తర్వాత ఈ ఏడాది పఠాన్ హిట్ కావడంతో(ఈ సినిమా వసూళ్ల ఫేక్ అని టాక్) 2023లో ఇక కుమ్మేసుడే అని అందరూ అనుకున్నారు. కానీ అది పాలపొంగులాంటిదే అని సెల్ఫీ ఫలితంతో తేలిపోయింది. దక్షిణాది నుంచి పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, విక్రమ్, కార్తీకేయ-2, కేజీఎఫ్-2, కాంతార వంటి సినిమాలు డబ్ అయి హిందీ మార్కెట్‌ను దున్నేసిన తర్వాత.. హిందీ జనాలు ఆ బాలీవుడ్ సినిమాలను దేకడం లేదు. పైగా పంక్షన్లలో దక్షిణాది సినిమాల స్ఫూప్‌లు, అవే పాటలతో ఉత్తరాది జనం మైమరచిపోతున్నారు. పాపం బాలీవుడ్.. 2023లోనూ గ్రహచారం బాగోలేనట్టుంది. ఎందుకైనా మంచిది దక్షిణాది సినిమాలను డబ్బింగ్ చేసి వదలితే మంచిది. పైగా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇందుకు అదనం. ఈ మాట అంటున్నది ఎవరో కాదు అక్కడి మీడియానే. ఈ రీమేక్‌ల వల్ల నిర్మాతల నెత్తి మీద ఎర్రతువాళ్లు తప్ప పెద్దగా ఫాయిదా లేదని అక్కడి మీడియా కోడై కూస్తోంది. అయ్యో.. బాలీవుడ్‌కు ఎంత కష్టం వచ్చింది..