
TSPSC Paper Leakage : మొన్న ఏపీలో గ్రూప్-1 ప్రిలీమినరీ పరీక్ష జరిగింది. ఇది నిర్వహించింది ఏపీఎస్సీసీ కాదు. టాటా గ్రూప్. అదేంటి టాటా గ్రూప్ గ్రూప్-1 పరీక్ష నిర్వహించడమేంటి అనుకుంటున్నారా? ఎస్.. మీ సందేహం కరక్టే. కానీ ఏపీ ప్రభుత్వం మిగతా విషయాల్లో ఎలా ఉన్నా ఉద్యోగ నియామక పరీక్షల్లో మాత్రం కచ్చితత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీఎస్సీసీ పర్యవేక్షణకు మాత్రమే ఉంచి, మిగతా వ్యవహారాన్ని టాటా అయాన్ అప్పగించింది. దీంతో అక్కడ పరీక్ష సజావుగా జరిగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పేపర్ లీకేజీ అనేది సర్వసాధారణమైపోయింది. అధునాతన వ్యవస్థ ఉన్నా వీటి కట్టడి సాధ్యపడటం లేదు. ఫలితంగా ఉద్యోగ నియామక బోర్డుల పనితీరు పై అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఎన్నికల సంవత్సరం ముందే ఉద్యోగాలకు పచ్చ జెండా ఊపడంతో అభ్యర్థులపై ఒత్తిడి పెరిగిపోతోంది. రేయనక, పగలనక ప్రిపేర్ అయితే పేపర్ లీక్ వంటి ఘటనలతో వారిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోంది. తాజాగా తెలంగాణలో ప్రవీణ్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి పేపర్ లీక్ చేసినట్టు రుజువు కావడంతో మరో సారి టీఎస్ పీఎస్ సీ బోర్డు పనితీరుపై అనుమానాలు నెలకొన్నాయి.
డిజిటల్ మాధ్యమే సరి
ప్రభుత్వరంగ బ్యాంకులు క్లరికల్ పోస్టుల భర్తీకి డిజిటల్ మాధ్యమం లోనే పరీక్షలు నిర్వహిస్తుంటాయి. దీనివల్ల పేపర్ లీక్‌కు అవకాశం ఉండదు. పైగా అభ్యర్థులకు ఏ బుక్‌లెట్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారో చివరి నిమిషం వరకు తెలియదు. పూర్తి డిజిటల్ మాధ్యమం కావడంతో ఏ చిన్న అవకతవకకు కూడా ఆస్కారం ఉండదు. ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే ప్రత్యామ్నాయం ఉంటుంది. అప్పుడు అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదు. పైగా మొన్న జరిగిన ఏపీ గ్రూప్ _1 ప్రిలిమినరీ పరీక్ష లో ఏపీపీఎస్సీ అధికారులు దాదాపు 35,000 ప్రశ్నలు రూపొందించారు..వీటి ఆధారంగా టాటా కంపెనీ వందల కొద్దీ క్వశ్చన్ పేపర్ లు తయారు చేసింది. అది కూడా రెండో కంటికి తెలియకుండా.. పైగా ఈ ప్రక్రియ ఎక్కడో న్యూ ఢిల్లీ లో జరిగింది.
అవకతవకలకు ఆస్కారం లేదు
ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగ నియామకాల బోర్డు నిర్వహించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరీక్షలో పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో డిజిటల్ మాధ్యమంలోనే పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మొన్న జరిగిన ఏపీ గ్రూప్-1 ప్రిలీమనరీ పరీక్ష నిర్వహణ బాధ్యత టాటా కంపెనీకి అప్పగించింది. దీనివల్ల లీకేజీ సమస్య ఎదురుకాలేదు. వాస్తవానికి ఇలాంటి పరీక్షల నిర్వహణలో టాటా గ్రూప్ కొత్తకొత్త ప్రయోగాలు చేస్తోంది. ముందుగా ప్రభుత్వ నియామక బోర్డులు టాటా కంపెనీకి ప్రశ్నల సరళి ఇస్తాయి. వాటిల్లో కొన్నింటిని ఎంచుకుని పరీక్ష పత్రం తయారు చేసి బోర్డుకు అందజేస్తుంది. ఇందులో కేవలం కంప్యూటర్ల ప్రమేయం మాత్రమే ఉంటుంది. మనుషుల ప్రమేయం లేనప్పుడు అవకతవకలకు ఆస్కారం ఉండదు. ప్రస్తుతం తెలంగాణ ఉదంతం నేపథ్యంలో డిజిటల్ మాధ్యమంలో పరీక్ష నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.