High Court on Omicron: చైనాలోని వూహాన్ లో పుట్టిన మహమ్మారి కరోనా రూపాలు మార్చుకుంటూ మరింత బలోపేతమై వేవ్ ల రూపంలో విరుచుకుపడుతూనే ఉంది. మొదటి వేవ్ ను లాక్ డౌన్ పెట్టి కంట్రోల్ చేసిన భారతదేశం.. రెండోవేవ్ కు కుదేలైంది. దేశంలో మరణ మృదంగాన్ని కరోనా వినిపించింది. దాని నుంచి కోలుకుంటున్న ఈ వేళ ఇప్పుడు మూడో ముప్పు పొంచి ఉంది.
దేశంలో సెకండ్ వేవ్ కు కారణమైన ‘డెల్టా’ వేరియంట్ కంటే 10 రెట్లు వేగంగా వ్యాపించే ‘ఒమిక్రాన్’ వైరస్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ఇప్పటికే యూరప్, అమెరికాను అతలాకుతలం చేస్తోంది. రోజుకు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని యూరప్ దేశాలు లాక్ డౌన్ కూడా విధించాయి. ఇక దేశంలోనూ ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చి చాపకింద నీరులా కేసులను పెంచుతోంది.
ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు అలెర్ట్ అయ్యింది. ఈ సంవత్సరం నూతన సంవత్సరం వేడుకలతోపాటు క్రిస్మస్ వేడుకలపై కూడా ఆంక్షలు పెట్టింది. గత రెండేళ్లుగా వేడుకలకు దూరంగా ఉన్న ప్రజలు ఈసారి న్యూఇయర్ ను పండుగలా జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ వారి ఆనందానికి ‘ఒమిక్రాన్’ రూపంలో చెక్ పడింది.
కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు నేడు విచారించింది. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనం గుంపులు గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది.
Also Read: సినిమా టికెట్ల తగ్గింపు వివాదం: ప్రశ్నించిన హీరో నానిని టార్గెట్ చేసి వైసీపీ.. తప్పెవరిది?
ఇక ఒమిక్రాన్ తీవ్రత రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలోనే దేశ ప్రధాని ఆయా రాష్ట్రాలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. లాక్ డౌన్ పై, ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక తెలంగాణలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కరోనా తగ్గుముఖం పట్టిందని నిబంధనలు సడలించింది. దీంతో జనం సాధారణ జనజీవనానికి అలవాటుపడ్డారు. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి ఆంక్షలు, లాక్ డౌన్ తప్పదా? అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు క్రిస్మస్, న్యూఇయర్ పండుగలపై తెలంగాణలో నిషేధంతో జనాలు ఉసూరుమన్నారు. పండుగలు చేసుకోలేక రెండేళ్లుగా మొహం వాచిన వారికి ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది.
Also Read: డబ్బులిచ్చి మరీ తెలుగు న్యూస్ చానల్స్ లో కేఏ పాల్ ప్రమోషన్ అందుకోసమేనట?